వైకాపా సభ్యులపై సస్పెన్షన్ వేటు తప్పదా?

 

వైకాపాకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై తెదేపా సభ్యురాలు అనిత ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానంపై ఈరోజు సభలో చర్చ జరిగినప్పుడు వైకాపా సభ్యులు అందరూ స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరారు. స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ కూడా వారిని క్షమించినట్లు ప్రకటించారు. కానీ వారి అధినేత జగన్మోహన్ రెడ్డి తను బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్దం అంటూనే గత చరిత్రలు చదవడం మొదలుపెట్టారు. ఆయన తీరు చూస్తే ఆయనలో ఎటువంటి పశ్చాతాపం కనబడటంలేదు, కేవలం తన యం.యల్యేలపై సస్పెన్షన్ వేటు పడుతుందనే భయంతోనే మాట్లాడుతున్నట్లుందని మంత్రి అచ్చెం నాయుడు ఆక్షేపించారు. మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సభా హక్కుల ఉల్లంఘనపై ఇంకా చర్చ పూర్తవ్వలేదని, తామిచ్చిన నోటీసులను ఇంకా వెనక్కి తీసుకోలేదని అనడం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోకుంటే బహుశః రేపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేస్తారేమో!