సంస్థాగత నిర్మాణం లేనందునే ఓడిపోయాము: తుమ్మల

 

ఇదివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు తెరాస పార్టీకి బలమయిన పునాది కానీ, సంస్థాగత నిర్మాణం గానీ లేదని,కేవలం తెలంగాణా సెంటిమెంటు మీద ఆధారపడే పార్టీ నడుస్తోందని అటువంటి పార్టీని ఎన్నికలలో ఓడించడానికి బలమయిన క్యాడర్ ఉన్న బీజేపీకి పెద్ద కష్టం కాదని అన్నారు. తమ పార్టీ గురించి ఆయన అంత చులకనగా మాట్లాడతానని కేసీఆర్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

కానీ మొన్న జరిగిన యం.యల్సీ.ఎన్నికలలో తెరాస అభ్యర్ధి జి. దేవీ ప్రసాద రావు బీజేపీ అభ్యర్ధి రామచంద్రారావు చేతిలో ఓడిపోవడంతో ఆనాడు అమిత్ షా తెరాస గురించి చెప్పిన మాటలు నిజమని రుజువయింది. గమ్మత్తయిన విషయం ఏమిటంటే మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా సరిగ్గా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం. తమ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోవడం వలననే ఎన్నికలలో ఓడిపోయామని, కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తమ సత్తా చూపిస్తామని ఆయన అన్నారు.

 

తమ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని అంగీకరిస్తున్నప్పుడు ఆంద్ర ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం తెరాస ఏవిధంగా విజయం సాధించగలదు? అక్కడ గెలవడం కష్టమని తెలుసు గనుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పై మంచి పట్టు ఉన్న తెదేపా యం.యల్యేలను పార్టీలోకి రప్పించుకొన్నారు. అందుకే హడావుడిగా వివిధ కులాలు, మతాలకు ప్రార్ధనా మందిరాలు వగైరా నిర్మించి ఇస్తున్నారు. ఇంకా చాలానే ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తెరాసకి సంస్థాగత నిర్మాణం లేదని ప్రతిపక్షాలు కూడా గుర్తించగలిగినప్పుడే తెరాస అధిష్టానం అప్రమత్తమయ్యే బదులు తమ లోపాన్ని ఎట్టి చూపించిన వారిపై ఎదురు దాడి చేయడం వలన చివరికి నష్టపోయింది ఎవరు?