Latest News
‘మా’ ఎన్నికలు.. డోకు...
posted on: Mar 26, 2015 5:52PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న తంతును గమనిస్తున్న వారికి డోకు వచ్చే పరిస్థితులు తయారయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ నటులందరూ కలసి ‘మా’ ఎన్నికల ప్రక్రియను ఒక కామెడీ ప్రహసనంగా మార్చేశారు. మాదంతా సినిమా కుటుంబం, మేమంతా ఒక్కటే అని చెప్పుకునే సినీ నటులు ఇప్పుడు ‘మా’ ఎన్నికల పుణ్యమా అంటూ మీడియాకు ఎక్కి పెద్ద పెద్ద డైలాగ్స్ చెబుతున్నారు. ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఏ స్థాయిలో రాజకీయాలు నడుస్తాయో, ఆ స్థాయి రాజకీయాలు నడుపుతూ నటులు తమ స్థాయిని తగ్గించుకుంటున్నారు.
అసలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి సంబంధించిన పదవుల్లో ఎవరు వున్నా సినిమా రంగంలో ఉన్న పేద నటీనటులను ఉద్ధరించేదేమీ లేదు. ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు కూడా. ఎవరు పదవుల్లో వున్నా ఆ పదవులు అడ్డు పెట్టుకుని ఇండస్ట్రీలో బిల్డప్పు ఇవ్వడం తప్ప ఆకలికి మాడుతున్న, అవకాశాలు లేక అల్లాడుతున్న నటులకు ఒరిగిందేమీ లేదు. గతంలో ఉన్నవాళ్ళు ఉద్ధరించిందేమీ లేదు.. కొత్తగా వచ్చేవాళ్ళు ఉద్ధరించడానికి అవకాశమూ లేదు. ‘మా’ అనేది చాలా తక్కువ విస్తృతి వున్న చాలా చిన్న సంస్థ. ఆ సంస్థలో అధికారం చెలాయించడానికి నటీనటులు పడుతున్న తంటాలు, ఒకరినొకరు తిట్టుకుంటున్న విధానం చూస్తే డోకొస్తోంది. రాజకీయ రంగంలో వున్నవారు పదవుల కోసం ఇలా తిట్టుకుంటే అది ఒక పద్ధతిగా వుంటుంది. మరి సినిమా వాళ్ళు కూడా రాజకీయ నాయకులంటే ఘోరంగా తిట్టుకుంటూ వుండటం చూడ్డానికి చాలా విచిత్రంగా వుంది. ఆ తిట్టుకోవడం కూడా సహజంగా నటనలో పండిపోయినవాళ్ళు కాబట్టి రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ తిట్టుకుంటూ తరిస్తున్నారు. సినిమాల్లో నటన సంగతేమోగానీ ఈ ఎలక్షన్ల సందర్భంగా వీళ్ళు ప్రదర్శిస్తున్న నటన చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకూ పనికిరాని, జనాలకి ఎలాంటి సంబంధం లేని ఒక సంస్థకి ఎన్నికలు జరగడమేంటో... దానికోసం వీళ్ళు జుట్టు జుట్టు పట్టుకోవడమేంటో.. దానికి మీడియాలో భారీ కవరేజ్ ఏంటో... ఇప్పటి వరకు తెప్పించిన డోకు చాలు.. ఇక ఆపండయ్యా బాబు...



.jpg)


