జగన్ తో సంధి కుదుర్చుకున్న వివేకానందరెడ్డి
posted on May 22, 2012 11:33AM
రాజకీయంగా, కుటుంబపరంగా ఏకాకిగా మిగిలిన వై.ఎస్.వివేకానందరెడ్డి గత్యంతరం లేక జగన్ తో రాజీకి వచ్చినట్లు తెలిసింది. పార్లమెంటు సభ్యుడుగానూ, మంత్రిగానూ పనిచేసిన వివేకానందరెడ్డి వై.ఎస్. మరణానంతరం కుటుంబసభ్యుల అభిష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. జగన్ ను దేబ్బకోట్టాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవిని కూడా కట్టబెట్టింది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తన వదినగారైన విజయమ్మపై పోటీ చేసి దారుణంగా పరాజయం పాలయ్యారు.
అప్పటినుంచి వివేకానంద పతనం ప్రారంభమైంది. అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు కుటుంబానికి కూడా దూరమై ఏకాకిగా మారారు. కొంతకాలం ఆయన మానసిక ప్రశాంతత కోసం ప్రకృతి చికిత్సాలయంలో కూడా చేరారు. అక్కడినుంచి బయటికి వచ్చిన తరువాత వివేకానందరెడ్డి జగన్ కు దగ్గర కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జగన్ కు దూరమై తాను తప్పు చేశానన్న భావనతో ఉన్న వివేకానందరెడ్డి వై.ఎస్. వర్థంతి సందర్భంగా జగన్ తో చేయికలపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వచ్చే ఉప ఎన్నికల్లో ఆయన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కూడా తెలిసింది.