వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉండి ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించినట్లు సమాచారం. వివేకా మర్డర్ కేసులో ఫస్ట్ నుంచి సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

దాదాపు ఆరుగురు సాక్షులు ఇలా మరణించడంతో, ముఖ్యంగా కీలక సాక్షి రంగన్న మృతి తర్వాత, ప్రభుత్వం ఈ వరుస మరణాలపై దృష్టి సారించి సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సిట్ అధికారులు పులివెందులలో ఉంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ దర్యాప్తులో భాగంగా, వివేకా హత్య కేసులో మరో సాక్షిగా ఉన్న కసునూరు పరమేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు నేడు విచారిస్తున్నారు. మొదట తనకు నోటీసులు ఇవ్వలేదని పరమేశ్వర్ రెడ్డి వాదించినప్పటికీ, పోలీసులు ఆయనను ఇంటి నుంచి పులివెందులలోని విచారణ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. తాజాగా, ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు కూడా సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. రంగన్న మృతికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆమె నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. సుశీలమ్మను కూడా ఈ రోజు సాయంత్రం విచారించవచ్చని భావిస్తున్నారు.