కన్నడ నటి రన్యారావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

 

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెతో పాటు మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ ఎస్. విశ్వనాథ్ శెట్టి ఈ మేరకు తీర్పు వెలువరించారు. డీఆర్ఐ అధికారుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నిందితుల అభ్యర్థనలను తోసిపుచ్చారు. గత నెలలో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె వద్ద నుంచి సుమారు 14.7 కిలోల గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసులో రన్యాతో పాటు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తనను బెదిరించి ఇరికించారని రన్యారావు మొదట చెప్పినట్లు అధికారులు తెలిపారు. 

కానీ, డీఆర్ఐ లోతైన దర్యాప్తులో భాగంగా, ఈ బంగారం అక్రమ రవాణాలో రన్యారావు కొన్నేళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలిందని అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయవద్దని గట్టిగా వాదించారు.ఈ కేసులో మూడో నిందితుడిగా (ఏ3) ఉన్న ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్‌ను కూడా డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బెయిల్ కోసం రన్యారావు చేసిన ప్రయత్నాలు ఇప్పటికే రెండుసార్లు విఫలమయ్యాయి. మరో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితి లేదు. ఆమెపై నమోదైన కేసుల తీవ్రత దృష్ట్యా ఏడాది పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రన్యా రావుపై అక్రమ రవాణా నిరోధక చట్టం కింద అధికారులు అభియోగాలు మోపారు. దీంతో ఒక సంవత్సరం పాటు నిర్బంధంలో ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి. రన్యారావుపై కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ , 1947 (COFEPOSA) కింద కేసు నమోదు చేసినట్లు శుక్రవారం సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. కోఫెపోసా చట్టం కారణంగా ఒక సంవత్సరం పాటు బెయిల్ లభించే అవకాశం ఉండదని తెలుస్తోంది.