ఓటు వెయ్యనంటే.. చంపుతారు, గ్రామాలకు నిప్పు పెడతారు

 

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ సమరశంఖారాం బహిరంగ సభలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ.. తమకు ఓటు వెయ్యరు అనే వారి ఓట్లను తొలిగించేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమకు ఓట్లు వెయ్యరు అని తెలిస్తే వారిని చంపేందుకు సైతం చంద్రబాబు వెనుకాడరని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ కొన్ని గ్రామాలు ఓటెయ్యవని తెలిస్తే ఆ గ్రామాలకు నిప్పు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

చంద్రబాబు ఒక దొంగ, ఆయన పాలన రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. చట్టం ఒప్పుకోని డేటాను చంద్రబాబు బినామీ కంపెనీలు దొంగతనం చెయ్యడం నేరం కాదా అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా, ప్రైవేట్ కంపెనీలు వద్ద ఉండటం పెద్ద నేరం కదా అని నిలదీశారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ, బ్లూ ఫ్రాగ్ వంటి కంపెనీలకు ప్రజల డేటా దొంగచాటుగా దోచిపెట్టారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. టీడీపీ సేవా మిత్ర యాప్‌తో ఓట్లను తొలగించడం, నమోదు చేయడం చేస్తున్నారని ఆరోపించారు. డేటా ఆధారంగా వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఇలాంటి నేరస్థుడిని క్షమించకూడదన్నారు. దొంగతనం చేసిన చంద్రబాబు తీరా దొరికిపోయే సరికి దొంగే దొంగ అంటూ నానా హంగామా చేస్తున్నారు అని విమర్శించారు. దొంగ ఓట్లను తొలగించి కొత్త ఓటర్లను యాడ్ చెయ్యమని వైసీపీ నిలదీసినా, అప్లికేషన్ ఇచ్చినా తామేదో అన్యాయం చేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. చివరికి తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఓటును కూడా తొలగించారని కానీ లోకేష్ ఓటు కానీ చంద్రబాబు ఓటు కానీ గల్లంతు కాలేదన్నారు. తప్పుచేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి వైసీపీ దొంగతనం చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు సంబంధించి వ్యక్తిగత డేటాను ప్రైవేట్ కంపెనీలు దగ్గర ఉండటం సుప్రీకోర్టు సైతం నేరంగా పరిగణిస్తోందని జగన్ తెలిపారు. సిగ్గుమాలిన పనులు చేస్తున్న చంద్రబాబు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పుమీద తప్పు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu