హ్యాకైన బీజేపీ అధికారిక వెబ్ సైట్

 

కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి చెందిన అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్‌ కి గురైంది. ఈ విషయాన్ని గమనించిన వెబ్ సైట్ నిర్వాహకులు.. సైట్ ని నిలిపివేశారు. మంగళవారం పార్టీ అధికార వెబ్ సైట్‌లో ప్రధాని మోదీ ఫోటోలతో పాటు జర్మనీ వైస్ ఛాన్సలర్ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. అదేవిధంగా మోదీకి వ్యతిరేకంగా పోస్టులు కూడా దర్శనమిచ్చాయి. మోదీ దేశ ప్రజలను మోసం చేశారనే అర్థం వచ్చేలా మీమ్స్ క్రియేట్ చేసి ఆ వెబ్ సైట్ లో పెట్టారు. దీంతో దానిని గమనించిన కొందరు సోషల్ మీడియా యూజర్లు వెబ్ సైట్ కి రిపోర్టు చేశారు. ఇందులో మోదీకి చెందిన మేమ్స్‌ను పోస్ట్ చేశారని సదరు యూజర్లు వాటి స్క్రీన్‌షాట్లను బయటపెట్టారు. సోదరసోదరీమణులారా.. నేను మీ అందరినీ ఫూల్స్ ని చేశాను. ఇంకా ఇలాంటివి చాలా రానున్నాయి అని మోదీ అన్నట్లుగా ఈ మేమ్స్ పోస్ట్ చేయడం విశేషం. దీంతో వెంటనే స్పందించిన బీజేపీ తమ వెబ్‌సైట్‌ను వెంటనే నిలిపేసింది.

ప్రస్తుతం ఆ సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. ప్రస్తుతం మెయింటెనెన్స్ పని నడుస్తున్నదని, త్వరలోనే తిరిగి మీ ముందుకు వస్తామన్న సందేశం కనిపిస్తున్నది. బీజేపీ వెబ్ సైట్‌ను హ్యాక్ చేసింది తామే అంటూ ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించుకోలేదు. అయితే పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు భారతీయ వెబ్‌సైట్లను హ్యాక్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపించిన నేపథ్యంలో.. బీజేపీ వెబ్ సైట్ హ్యాకింగ్‌కు గురికావడం చర్చనీయాంశంగా మారింది. గత నెలలో చత్తీస్‌గఢ్ బీజేపీకి చెందిన వెబ్‌సైట్ కూడా హ్యాకింగ్‌కు గురైంది. అందులో పాకిస్థాన్ జెండా కనిపించడం అప్పట్లో దుమారం రేపింది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu