టీడీపీకి షాక్.. పవన్ కళ్యాణ్ తో మాగుంట భేటీ
posted on Mar 5, 2019 4:07PM

టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇరువురి మధ్య దాదాపు 20 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. మాగుంట శ్రీనివాసులు ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజులు క్రితం ఆయన వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, త్వరలో వైసీపీలో చేరతారని వార్తలొచ్చాయి. ఆ వార్తల నేపథ్యంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. దీంతో వైసిపిలో చేరే అలోచనను ఆయన విరమించుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు టీడీపీలో అసంతృప్తి, మరోవైపు ఒంగోలు ఎంపీ సీటును కేటాయించడానికి వైసీపీ సముఖంగా లేదని తెలియడంతోనే ఆయన పవన్ ని కలిసినట్లు సమాచారం. మరి మాగుంట జనసేనలో చేరతారేమో చూడాలి.