టీడీపీలోకి జేడీ లక్ష్మీనారాయణ.. ఎమ్మెల్యేగా పోటీ!!
posted on Mar 12, 2019 10:51AM

జేడీ లక్ష్మీనారాయణ.. తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమైన పేరు. అప్పట్లో జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కేసుల్ని దర్యాప్తు చేసి సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు ఆయన గురించి ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలో ఆయన టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ఎప్పుడో ప్రకటించారు. దీంతో ఆయన కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారని కొన్నాళ్లు, లోక్‌సత్తా పార్టీని నడిపిస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన సైలంట్ అయిపోయారు. తాజాగా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం ఖాయమని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందని సమాచారం.
తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో లక్ష్మీనారాయణ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగానే జేడీ టీడీపీలోకి వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని, కొద్దిరోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే ఎన్నికల ముందు టీడీపీకి మంచి మైలేజీ అనే చెప్పాలి.