ఆగ్రా పేరుని ఆగ్రవన్ గా మార్చనున్న యూపీ ప్రభుత్వం

 

యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తాజ్ మహల్ అంటేనే గుర్తుకొచ్చే పేరు ఆగ్రా.. ఇప్పుడు అలా పిలవడానికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం "ఆగ్రావన్"  గా మార్చబోతున్నట్లు సమాచారం. ఇన్నాళ్ళు చారిత్రక నగరంగా విరజిల్లిన ఆగ్రా పేరు త్వరలో కనుమరుగుకానుంది. అయితే ఆగ్రావన్ పేరు అధికారికంగా నిర్ణయించనప్పటికీ చారిత్రకంగా ఇంకా ఏదైనా మంచి పేరు ఉంటే సూచించాలని యూపీ ప్రభుత్వం అంబేద్కర్ వర్సిటీకి ఒక లేఖ కూడా రాసింది. పూర్వం ఆగ్రవన్ పేరే ఉండేదని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యం లోనే ఆ పేరే ఖరారయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తుంది. 

ఆగ్రాకు పర్యాటక కేంద్రంగా ఎంతో ప్రాధాన్యముంది. తాజ్ మహల్ ఇక్కడే ఉండడంతో పేరు మార్చితే పర్యాటకంగా నష్టపోతామని కొందరు చెప్తున్నారు. ఫైజాబాద్ అయోధ్యగా పేరు మార్చారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్య నాథ్ బాధ్యతలు చేపట్టాక ప్రముఖ నగరాల పేర్లు మార్చుతూ వస్తున్నారు. ఇప్పుడా తాజా జాబితాలో ఆగ్రా కూడా చేరింది. దీని కోసం డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ వర్సిటీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. చరిత్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సుగం ఆనంద్ పర్యవేక్షణలో పరిశోధన మొదలైంది. తాజ్ నగర్ కు మొదట్లో ఆగ్రవన్ పేరే ఉండదని ఇంకా ప్రాథమిక సాక్ష్యాలేంటి అన్న దానిపై సమస్త సమాచారాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు. మహాభారత కాలంలో ఈ ప్రాంతానికి ఆగ్రవన్ అంటే అగ్రభాగంలోని బాణం అన్న అర్థం వచ్చేలా పేరుండేది. ఆగ్రా గెజిట్ లో కూడా ఈ ప్రస్తావన ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అంగీ రమణి ఈ ప్రాంతంలో తపస్సు చేయడంతో ఆయన పేరుతో ఈ నగరాన్ని అంగీరు అని పిలిచేవారని కథలో కూడా ఉంది.