షర్మిల నుంచి వైఎస్ ను దూరం చేయగలరా?
posted on Jan 23, 2024 11:44AM
వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలో క్రియాశీలం అవుతుంటే.. వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. దివంగత వైఎస్ తనయగా ఆమె తండ్రి వారసత్వం తన నుంచి లాగేసుకుంటోందన్న భయం జగన్ ను వెంటాడుతోంది. ఆమె మాటల తూటాలు తన కోటను బద్దలు కొట్టేస్తాయన్న వణుకు నిలవనీయడం లేదు. వైసీపీ అధికారానికి ఏపీలో షర్మిల ఎంట్రీ చరమగీతం పాడేయడం ఖాయమన్న నిర్ణయానికి జగన్ అండ్ కో వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఆమెను నిలువరించాలంటే ఆమెపై, ఆమె వ్యక్తిత్వంపై బురద జల్లడంతో పాటు ఆమెను వైఎస్ కుటుంబీకురాలు కాదని ప్రజలలో ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది.
అందుకే వైసీపీ సామాజిక మాధ్యమ విభాగంలో వైఎస్ షర్మిలపై దుష్ఫ్రచారం, దూషణలు మొదలెట్టేసింది. అంతే కాదు.. ఆమె నుంచి వైఎస్ ను దూరం చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అందుకే ఎక్కడా వైఎస్ షర్మిల పేరు ముందు వైఎస్ అన్న అక్షరాలు లేకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. అంతే కాదు.. జగన్ అనుకూల మీడియా కూడా ఉద్దేశపూర్వకంగా వైఎస్ షర్మిల వార్తల కవరేజ్ లో ఆమె పేరు ముందు వైఎస్ అక్షరాలను మాయం చేస్తున్నది. ఇక ఆమె మొదటి వివాహం, రెండో వివాహం అంటూ వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకుంటూ ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఎస్టాబ్లిష్ చేయడానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం నానా తంటాలు పడుతోంది.
ఒక వైపు ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల.. ఆయన కూడా వైఎస్ షర్మిల అనడం లేదు. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయంటూ కన్నీరు పెట్టుకున్నంత పని చేసి, మెత్తగానే అయినా ఆమె చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ ఓ రకంగా విష ప్రచారానికి తెర లేపారు. వైఎస్ ను, వైఎస్ కుటుంబాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, విమర్శించి, దూషించిన వారి పంచన చేరారంటూ సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నించారు. ఇక సజ్జల పుత్రరత్నం, వైసీపీ మీడియా వింగ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డి అయితే.. మర్యాద ముసుగు తీసేసి.. ఆయన హయాంలో వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఆరితేరిన బూతు పురాణంతో రెచ్చిపోతున్నారు. మొత్తంగా ఎంతగా ప్రయత్నించినా వైఎస్ షర్మిల పేరు నుంచి వైఎస్ పదాలను తీసేయడం సాధ్యమయ్యే పని కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గతంలో షర్మిల జగన్ కోసం చేసిన ప్రచారం సందర్భంగా ఆమె వైఎస్ షర్మిలగానే ప్రజల ముందుకు వచ్చారు. వైఎస్ రాజన్న బిడ్డగానే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్ కెరీర్ కొనసాగిస్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని రంగాలలోనే విఫలం కావడం ద్వారా వైఎస్ రాజకీయ వారసత్వ గుర్తింపును జగన్ స్వయంగా పోగొట్టుకున్నారనీ, అందుకే వైఎస్ షర్మిలను వైఎస్ వారసురాలిగా రాజకీయవర్గాలు గుర్తిస్తున్నాయనీ అంటున్నారు.