వైసీపీ కి మరోషాక్... నరసారావుపేటఎంపీ రాజీనామా
posted on Jan 23, 2024 12:07PM
నరసరావుపేట వైసిపి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో 15 రోజులుగా అనిశ్చితి నెలకొన్నదని తెలిపారు. పార్టీ కేడర్ కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ అనిశ్చితికి తెరదించాలనే ఉద్దేశంతోనే పార్టీని వీడటంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ అనిశ్చితికి కారణం తాను కాదని స్పష్టం చేశారు. నరసరావుపేటకు అధిష్టానం కొత్త అభ్యర్థిని తీసుకువాలనుకుంది. దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అందుకే చాలా స్పష్టంగా నా అభిప్రాయం చెప్పి రాజీనామా చేశాను అని వెల్లడించారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎంపీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేసినట్లు చెప్పారు. గడిచిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. రాజకీయంగా పార్టీలో కొంత అనిశ్చితి ఏర్పడిందన్నారు.శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారన్న వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. గుంటూరు లేదా నరసరావుపేట లోక్‌సభ స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశాన్ని శ్రీకృష్ణ దేవరాయలుకే చంద్రబాబు వదిలేశారని సమాచారం. శ్రీకృష్ణదేవరాయలు లోకేశ్‌తోనూ సమావేశమైనట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పులో భాగంగా ఈసారి నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దించాలని ప్లాన్ చేసిన వైసీపీ హైకమాండ్.. కృష్ణదేవరాయలును గుంటూరుకు వెళ్లాలని సూచించింది. అయితే ఈ ప్రతిపాదనకు శ్రీకృష్ణదేవరాయలు విముఖత వ్యక్తం చేశారు. ఇటీవల జగన్‌తో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు ఆయన. దీంతో నరసరావుపేట టికెట్ ఇచ్చేది లేదని హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో గత 15, 20 రోజులుగా అనిశ్చితి నెలకొందని చెప్పారు. అనిశ్చితికి తెర పడాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు. అనిశ్చితికి తాను కారణం కాదని, ఈ అనిశ్చితిని తాను కోరుకోలేదని అన్నారు. ఈ అనిశ్చితి వల్ల తనకు కానీ, పార్టీకి కానీ ఉపయోగం లేదని చెప్పారు. క్యాడర్ కూడా ఏ డైరెక్షన్ లో వెళ్లాలనే గందరగోళంలో ఉన్నారని తెలిపారు. దీనికి పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే తాను రాజీనామా చేశానని చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానని తెలిపారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పారు. దీని వల్ల అందరూ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని తెలిపారు. దీనికి తెరదించుతూ.. తాను ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తనను ప్రోత్సహించి ఎంపీ టికెట్ ఇచ్చారని... ఆయన ఆకాంక్షల మేరకు తాను పార్టీని ఉన్నత స్థాయిలో ఉంచానని తెలిపారు. ఎంపీ అంటే ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి కనిపిస్తాడనే భావనను తాను తొలగించానని... ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలా అండగా ఉన్నానని తెలిపారు.
ఇక వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపికి రాజీనామా చేశారు. బాల శౌరి జనసేనతీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజీనామాలు కామన్ అంటున్నారు వైసీపీ నేతలు. ఎవరు రాజీనామాలు చేసినా పార్టీకి జరిగే నష్టం ఏం లేదని తేల్చి చెప్తున్నారు. టికెట్ కుదరదని చెప్పడంతోనే నేతలు పార్టీని వీడుతున్నారని స్పష్టంచేశారు.