మూడు రాజధానుల కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు!

కింద పడ్డాపై చేయి మాదే అన్నచందంగా ఉంది జగన్ వైఖరి. కోర్టులు అక్షింతలు వేసినా, కేంద్రం కాదూ కూడదని స్పష్టం చేసినా, జనం ఛీ అంటున్నా జగన్ మాత్రం ముడు ముక్కులాటే అంటున్నారు. మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని జగన్ తన మొండి పట్టుదలను వదలడం లేదు. ఇందు కోసం రాజ్యసభలో ఏకంగా ప్రైవేటు బిల్లు పెట్టారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి మూడు రాజధానులపై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదేననీ, సర్వాధికారాలూ రాష్ట్రానికే ఉండాలని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆర్టికల్ త్రీని సవరించాలని కోరుతూ ఆయన ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టారు. గతంలో కేంద్రం ఏ మాట అయితే చెప్పిందో అదే మాటకు కట్టుబడి ఉండాలంటూ వైసీపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది.

అందుకే మూడు రాజధానుల విషయంలో రాజ్యాంగ సవరణ చేయాలంటూ ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టింది.  రాజధాని విషయంలో వైసీపీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలకలా కొట్టుకుంటున్నది.  రాజధాని విషయంలో వైసీపీ సర్కార్ పూర్తిగా ఇరుకున పడింది. చట్ట ప్రకారం చూసినా, కోర్టు తీర్పులను అనుసరించాల్సి వచ్చినా అమరావతి నిర్మించక తప్పని పరిస్థితి వైసీపీ సర్కార్ ది. మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

అయితే అక్కడ కూడా మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభలో మూడు రాజధానుల కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. అసలు రాజధాని అన్నది రాజ్యాంగంలోనే లేదని జగన్ ఇటీవలి కాలంలో తరచూ చెబుతున్నారు. అలా చెబుతూ కూడా ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సవరణ కోసం ప్రైవేటు బిల్లు పెట్టడం ఎందుకన్నది ఆ పార్టీ అధినేతకే తెలియాలి. తన మకాంను విశాఖ మారుస్తానంటూ రిషికొండను తవ్వేసి మరీ నిర్మించుకుంటున్న నిర్మాణాలపైనా వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థతుల్లోనే జగన్ మూడు రాజధానుల కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారని పరిశీలకులు చెబుతున్నారు.