వైసీపీకి పోటీగా నిలబడితే పథకాలు కట్! ఎమ్మెల్యే జోగి రమేష్ వార్నింగ్
posted on Feb 11, 2021 11:36AM
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల బరి తెగింపులు ఆగడం లేదు. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చినా తమ తీరు మార్చుకోవడం లేదు వైసీపీ ప్రజా ప్రతినిధులు. ఓటర్లను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతల బెదిరింపు వీడియోలు, ఆడియా కాల్స్ తీవ్ర కలకలం రేపాయి. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. తాజాగా కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కుడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ బెదిరించారు. వార్డు మెంబర్గా పోటీచేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు జోగి రమేష్. సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని..అయినా వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే జోగి రమేష్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.