గ్రేటర్ మేయర్ గా విజయలక్ష్మి! కేకేకు కేసీఆర్ కానుకిచ్చారా?
posted on Feb 11, 2021 11:16AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త పాలక మండలి కొలువు దీరింది. గ్రేటర్ కొత్త మేయర్ గా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మెన్ గా టీఆర్ఎస్ సీనియర్ నేత మోతే శోభన్ రెడ్డి భార్య మోతే శ్రీలతా రెడ్డి ఎంపికయ్యారు. వీరిద్దరు పేర్లను సీఎం కేసీఆర్ సీల్డ్ కవర్ లో మంత్రుల చేత పంపించారు. గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గత ఎన్నికల సమయంలోనే ఆమె మేయర్ పీఠం కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈసారి ఆమెకు అదృష్టం వరించింది. మోతే శ్రీలత సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ నుంచి విజయం సాధించారు.
గ్రేటర్ మేయర్ గా కేకే కూతురు విజయలక్ష్మిని ఎంపిక చేయడానికి బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేటీఆర్ ను సీఎం చేయాలంటూ కొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే ప్రకటనలు చేశారు. కొందరు మంత్రులు కూడా కేటీఆర్ కు జై కొడుతూ అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం మారుతున్నారంటూ జరిగిన ప్రచారం.. పార్టీలో కలవరం రేపింది. అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొంది. ఈ పరిణామాలు కేసీఆర్ కు ఇబ్బందిగా మారాయి. పార్టీలో జరుగుతున్న ఘటనలు, కేటీఆర్ టీమ్ ఓవరాక్షన్ పై కేసీఆర్ అసహనంగా ఉన్న సమయంలో... ఎంపీ కేశవరావు ఎంటరై అంతా సెట్ రైట్ చేశారని తెలుస్తోంది. కేటీఆర్ తో పాటు పార్టీ నేతలతో మాట్లాడి అందరిని సెట్ రైట్ చేశారంటున్నారు. అదివారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి ముందు కేకే.. చాలా మంది నేతలతో మాట్లాడి పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించారంటున్నారు. అందుకే కేకేకు కానుకగా ఆమె కూతురు విజయలక్ష్మిని గ్రేటర్ మేయర్ గా కేసీఆర్ ఎంపిక చేశారని చెబుతున్నారు.
గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. ఎల్బీనగర్ జోన్ లోని లింగోజిగూడ నుంచి బీజేపీ తరపున గెలిచిన కార్పొరేటన్ చనిపోయారు. దీంతో 149 మంది కొత్త కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. ఉదయం పది గంటలకు కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ నేతలు.. ఎక్స్ అఫిషియో సభ్యులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో బల్దియా భవనానికి వెళ్లారు. ఈ సందర్బంగా బస్సులో కార్పొరేటర్లతో కలిసి వెళ్లిన ఎమ్మెల్సీ, గాయకుడు గోరటి వెంకన్న ఉత్సాహంగా పాటలు పాడారు. గోరటి పాడుతుండగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు గొంతు కలిపారు. మరోవైపు మేయర్ సీటును ఆశించిన విజయా రెడ్డి... ప్రమాణ స్వీకారం తర్వాత.. జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి కోపంగా బయటికి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఉన్న మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షాకయ్యారు.