వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో భారీగా చేరికలు..
posted on Sep 16, 2021 1:40PM
కాలం మారుతోంది. ఫ్యాన్ గాలి మళ్లుతోంది. రెండేళ్లలోనే వైసీపీ పాలనపై విరక్తి కలుగుతోంది. ఉపాధి లేక కార్మికులు అల్లాడుతున్నారు. పెట్టుబడులు, ఉద్యోగాలు లేక యువత బేజారవుతోంది. రాష్ట్రం అప్పులతో తిరోగమనం పాలవుతోంది. అన్ని రంగాల్లో వైఫల్యాలతో జగన్ పాలనపై అంతా పెదవి విరుస్తున్నారు. ఏకంగా వైసీపీ కార్యకర్తలే జగన్ ప్రభుత్వంపై విసుగు చెందుతున్నారు. అసమర్థ పాలనకు వ్యతిరేకంగా పార్టీని వీడుతున్నారు. అందుకే, ఇటీవల కాలంలో వైసీపీ నుంచి టీడీపీకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వలసల్లో గిద్దలూరు నియోజకవర్గం అన్నింటికంటే ముందుంటోంది.
ఇటీవల కొమరోలు మండలం రాజుపాలెంలో 125 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. తాజాగా, రాచర్ల మండలం అన్నంపల్లిలో 600 మంది అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీ కండువా కప్పుకోవడం సంచలనంగా మారింది.
అన్నంపల్లి గ్రామంలో జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. గ్రామానికి చెందిన శిరిగిరి వెంకటపతితో పాటు మరికొందరు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు, బోయ, యాదవ సామాజికవర్గాలకు చెందిన వైసీపీ వర్గీయులు పార్టీ మారిన వారిలో ఉన్నారు.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిక సందర్భంగా గ్రామంలో భారీ స్థాయిలో ర్యాలీ, ఊరేగింపు నిర్వహించారు. వందలాది మంది బైక్ ర్యాలీతో.. జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారు. గ్రామంలో అట్టహాసంగా సభ నిర్వహించి.. వైసీపీ పాలనను దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
అయితే, వందలాది మంది వైసీపీ కేడర్ టీడీపీలో చేరే సందర్భంగా నిర్వహించిన సభ ప్రారంభమైన కాసేపటికే గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. సభ ముగిసిన తర్వాత రావటం చర్చనీయాంశమైంది.