20 లక్షల చెక్కు వద్దు.. న్యాయం కావాలని బాలిక తండ్రి డిమాండ్..
posted on Sep 16, 2021 12:54PM
బిడ్డే పోయింది. హంతకుడిని పట్టుకోలేకపోయారు. వాడు చచ్చేదాకా లేట్ చేశారు. ఇప్పుడొచ్చి ఏం లాభం? 20 లక్షల చెక్కు ఇస్తే అయిపోతుందా? మాకు చెక్కు కాదు.. న్యాయం కావాలి.. అంటూ డిమాండ్ చేశారు సైదాబాద్ సింగరేణి కాలనీ బాలిక తండ్రి. ప్రభుత్వం ఇచ్చిన 20 లక్షల చెక్కును వెనక్కిచ్చేస్తామని చెప్పారు.
వారం రోజుల తర్వాత తీరిగ్గా వచ్చారు తెలంగాణ మంత్రులు. హోంమంత్రి మహమూద్ అలీ, స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు భారీ బందోబస్తు మధ్య సైదాబాద్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. 20 లక్షల చెక్కు ఇచ్చారు. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా ఇస్తామని హమీ ఇచ్చారు.

అయితే, నిందితుడిని పట్టుకోలేకపోయిన ప్రభుత్వంపై బాలిక కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు చేసిన సాయాన్ని తిరస్కరించారు. 20 లక్షల చెక్కు తమకు అవసరం లేదని లేల్చి చెప్పారు. మంత్రులు ఇచ్చిన చెక్కును వెనక్కి ఇచ్చేస్తాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.
‘‘మంత్రులు మా ఇంట్లో చెక్కును పెట్టి వెళ్లిపోయారు. మాకు చెక్కు కాదు.. న్యాయం కావాలి. చెక్కుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మరో రూ.20 లక్షలు అదనంగా ఇచ్చినా అవసరం లేదు’’ అని బాలిక తండ్రి చెప్పారు.