అసెంబ్లీ బరిలో ప్రియాంక? యోగికి చెక్ పెట్ట‌గ‌ల‌రా?

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోందా? ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ పోటీకి దిగుతోందా? అంటే అవుననే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ఇన్‌ఛార్జి ప్రియాంకా వాద్రా పార్టీకి ఊపు నిచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమయ్యారని పార్టీ వర్గాల సమాచారం.

అయితే,ప్రియాంకా వాద్రా ఎన్నికలలో పోటీచేయడం పెద్ద విశేషం కాదు. నిజానికి గత లోక్ సభ ఎన్నికల్లోనే ఆమె వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు సై’ అన్నారు. అయితే, ఓటమి భయంతోనో ఏమో వెనక్కి తగ్గారు. అదలా ఉంటే, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఇంతవరకు ఫాలో అవుతూ వచ్చిన ఎన్నికల అరంగేట్రం సంప్రదాయానికి విరుద్ధంగా ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం కావడంతో అది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

గాంధీ నెహ్రూ కుటుంబంలో నెహ్రూ  నుంచి రాహుల్ దాకా మూడు తరాలకు చెందిన అందరూ ఎన్నికలలో పోటీ చేశారు. అయితే, అందులో ఎవరూ కూడా లోక్ సభకే కాని ఆసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ పోటీ చేయడం అంటే అది చిన్నతనంగా, తమ స్థాయికి తగని పనిగా భావించడం వలన చేతనో, ఇంకేందుకో ఇంత  వరకు ఆ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడమే కాదు, ముఖ్యమంత్రి పదవి కూడా  నెహ్రూల స్థాయి కాదు, అనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది. అయితే, ఇప్పుడు ప్రియాంక, అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే కాదు, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిల్చేందుకు కూడా సిద్దమవుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే, గాంధీ కుటుంబ సభ్యుల్లో అసెంబ్లీకి పోటీపడిన తొలి వ్యక్తి ప్రియాంకే అవుతారు. 

అదలా ఉంటే, ప్రియాంక నిజంగానే పోటీ చేస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కుటుంబాన్ని ఎంతో కాలంగా ఆదరిస్తున్న అమేఠీ లేదంటే రాయ్‌బరేలి అసెంబ్లీ స్థానాలను ఎంచుకోవచ్చని అంటున్నారు. ఈ రెండు నియోజక వర్గాలు ఫ్యామిలీకి పట్టున్న నియోజకవర్గాల. అలాగే. ప్రియాంకకు బాగా పరిచయమున్న నియోజక వర్గాలు. అయితే, గత లోక్ సభ ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీని బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ఓడించారు. ప్రియాంక అక్కడే పోటీ చేస్తే బీజేపీ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అందువల్ల ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

అయితే, ప్రియాంక‌ పోటీ చేసినా, కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండండని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఐదే ఐదు స్థానాలు గెలుచుకుంది. చివరకు అమేథీ, రాయిబరేలి లోక్ సభ నియోజక వర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. అంతే కాదు, గడచిన ఐదు సంవత్సరాలలో పార్టీ పెద్దగా ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసిందీ లేదు. కాబట్టి, ప్రియాంక పోటీ చేయడంవలన హస్త వాసి గొప్పగా మారే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu