దళితులు పోటీ చేస్తే నరికేస్తారా..?
posted on Feb 19, 2021 9:06AM
ఏపీలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, రాచరికపు పాలనా కొనసాగుతుందా..? లేక రౌడీ పాలనా కొనసాగుతుందా..? అని నిత్యం ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ప్రతిపక్షాలలో కూడా ఈ సందేహం లేకపోలేదు.
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలు పెచ్చు రేగుతున్నాయి. దళితులపై జరుగుతున్న దాడులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామంలో దళితులపై వైసీపీ నాయకుల దాడి జగన్ రెడ్డి రాచరికపు అహంకార పాలనకి అద్దం పడుతోందని లోకేశ్ విమర్శించారు. జాతి తక్కువ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారా?... నరికి చంపేస్తాం అంటూ రాళ్లతో దళితులపై దాడి చెయ్యడం, ఇళ్లకు వెళ్లి బెదిరించడం అమానుషమన్నారు . కులం పేరుతో దూషించడమే కాకుండా, దళిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడులకు తెగబడ్డ వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లింగాపురం గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారు.
దళితుల ఓట్లు కావాలి వాళ్ళు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయవద్దు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. మనం ఇంకా ఏ సమాజం లో బతుకుతున్నాం. రాజ్యాంగం లో ఆర్టికల్ 14 చట్టం ముందు అందరు సమానులే అన్న పదాన్ని సమాధి చేసి బతుకుతున్నామా అంటూ ప్రజలు, ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.