ఏపీ కాంగ్రెస్ తో అలా.. టీ కాంగ్రెస్ తో ఇలా.. జగన్ స్ట్రాటజీ ఏంటో చెప్మా..!
posted on Nov 18, 2015 3:52PM

రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఒక్కోసారి నేతలు చేసే పనులు అర్ధంకాకపోయన దానిలో ఉన్న అంతరార్ధం ఏంటా అని అనుమానాలు వ్యక్తమవుతాయి. ప్రస్తుతం జగన్ చేసే పని చూస్తుంటే అలానే అనిపిస్తుంది ఎవరికైనా. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో జగన్ చాలా చురుకుగా పాల్గొంటున్నారు. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చిపడింది. ఎందుకంటే ఏపీ ప్రతిపక్షంగా ఉన్న జగన్ పార్టీ అండ్ కో అక్కడ చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో.. ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా ఉందని తెలుస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన దీక్షకు మద్దతు పలికింది. దీనిలో భాగంగానే పైకి కనిపించకపోయినా గత కొద్దిరోజులుగా రెండు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి వరకూ బానే ఉంది.. అయితే ఏపీ కాంగ్రెస్ తో దోస్తి కట్టిన జగన్.. తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఏమైందో ఏమో కాని అక్కడ ప్రచారానికి వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కు పడే ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు కూడా జగన్ ప్రచారంతో ఎగరేసుకుపోతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ తో దోస్తీ కట్టి.. తెలంగాణ కాంగ్రెస్ ను ఇబ్బందికి గురుచేస్తున్న జగన్ మనసులో ఏముందో.