పార్టీ మారనున్న శైలజానాథ్..? ఏకాకిగా రఘువీరా?

 

కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం ఎప్పటినుండో మొదలైంది. అడపా దడపా ఎవరో ఒకరు వేరే పార్టీలోకి మారుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తి అయిన శైలజానాథ్ కూడా చేరుతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.

 శైలజానాథ్ చాలా తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతగా ఎదిగారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ.. ఓ వెలుగు వెలిగారు. అయితే అది ఒకప్పుడు.. రాష్ట్రం విడిపోకముందు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత పరిస్థితి వేరు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేదు. అయితే అప్పుడే శైలజానాథ్ వైసీపీ లోకి కాని.. టీడీపీలోకి కాని మారే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కానీ అప్పుడు పార్టీ మారకుండానే 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయి.. ఇక ఆతరువాత మామూలుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలం గడుపుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులనుబట్టి చూస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే తెరుకునే పరిస్థితిలో లేదన్న విషయం అర్ధమై పార్టీ మారదామని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే శైలాజానాథ్ పై టీడీపీ అంత ఆసక్తి చూపించకపోవడంతో ఆయన వైసీపీ గూటికి వెళదామనుకుంటున్నట్టు.. ఈ విషయంలో జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా శింగనమలలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి టీడీపీ అభ్యర్ధి యామినీ బాల చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గత కొద్దిరోజులుగా పద్మావతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కారణంగా ఈసారి శింగనమల నుంచి శైలజానాథ్ ను పోటీలో దించాలని జగన్ చూస్తున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా పార్టీని వదిలిపెట్టి వెళిపోతున్నారు. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ లో రఘవీరా  రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు శైలజానాథ్ కూడా పార్టీ మారితే ఇక ఏకాకిగా మిగిలిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu