కేసీఆర్, చంద్రబాబు.. సూపర్ అండర్ స్టాండింగ్
posted on Nov 18, 2015 4:40PM

వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. తెలంగాణ అధికార పార్టీ నుండి కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక వైసీపీ నుండి జగన్, టీడీపీ-బీజేపీ తరుపున చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా నేతలే ప్రచారం చేస్తూ పని కానిచేస్తున్నారు. అయితే అందరి ప్రచారం సంగతేమో కాని కేసీఆర్ ప్రచారం మాత్రం కొంచెం గమనించాల్సిన విషయమే. ఎందుకంటే తను ప్రచారం చేసిన దగ్గరనుండి ఇప్పటివరకూ చంద్రబాబును పై ఒక్క విమర్శ కూడా చేయకపోవడం.
సాధారణంగా కేసీఆర్ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా.. చంద్రబాబుపై ఎప్పుడు అవాకులు చవాకులు పేల్చుదామా అని చూస్తుంటారు. అయితే అది ఒకప్పుడు మాట. అంటే వారిద్దరి మధ్య స్నేహం కుదరకముందు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే.. ఆఫ్టర్ ఏపీ శంకుస్థాపన.. బీఫోర్ ఏపీ శంకుస్థాపన అన్నట్టు తయారైంది. ఏపీ శంకుస్థాపన పుణ్యమా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య స్నేహ బంధం ఏర్పడిందనే చెప్పాలి. ఇక అప్పటినుండి ఎప్పుడూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే సీఎం లు మారారు. దానికి వరంగల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారమే నిదర్శనం. ఎందుకంటే ప్రచారంలో కేసీఆర్.. కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ పార్టీలను ఏకిపారేశారు కానీ.. టీడీపీపైకాని, చంద్రబాబు పైకాని ఒక్క విమర్శ కూడా చేయకపోవడం గమనార్హం. ఇక ఎలాగూ చంద్రబాబు వరంగల్ ప్రచారంలో దూరంగా ఉన్నారు. మొత్తానికి కేసీఆర్, చంద్రబాబు మంచి అండర్ స్టాండింగ్ మీదున్నట్టు అర్ధమవుతోంది.