వైసీపీ బరితెగించేసింది.. తెలుగుదేశం కూటమి అప్రమత్తంగా ఉండాల్సిందే!

ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఏం చేసైనా గెలుపు సొంతం చేసుకోవడమే లక్ష్యం అంటూ వైసీపీ బరితెగించేసింది.   తన అస్తిత్వం, ఉనికి ప్రమాదంలో పడిందని భావించినప్పుడు సామాన్యులు కూ ఎంతో కొంత తెగిస్తాడు. అయితే  పరిమితులు, హద్దులు చెరిపేసి మరీ చేసే అరాచక విన్యాసాన్ని బరితెగింపు అంటాం. ఇప్పుడు గెలుపు తలుపులు అన్నీ మూసుకు పోయాయి అని అర్ధమైన తరువాత వైసీపీ అధినేత జగన్, ఆయన కోటరీ బరితెగించేశారు.   ఏదో సినిమాలో ఓ డైలాగు ఉంటుంది. పది మంది మంచి కోసం చావడానికైనా చంపడానికైనా రెడీ అని.. ఇప్పుడు వైసీపీ మంచి కోసం కాదు, తన ఉనికి కోసం అలాంటి బరితెగింపును ఆశ్రయించింది. దానినే ప్రదర్శిస్తున్నది.   ధర్మాధర్మాలూ నీతినియమొలూ ఉచితానుచితాలూ పెద్దాచిన్నా స్వపరభేదాలూ సమయాసమయాలూ ఏమీ లెక్కచేయడం లేదు. రాష్ట్రం, జనం ఏమైపోయినా, ఏమనుకున్న ఫరవాలేదు.. గెలస్తే చాలు అన్నట్లుగా బరితెగించి వ్యవహరిస్తున్నది.  

జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం, ఆ తరువాత సొంత పార్టీ ఏర్పాటు, అధికారపగ్గాలు అందుకోవడం ఇలా అన్ని విషయాలలోనూ బరితెగింపునే ఆశ్రయించారని చెప్పాలి.    తన తండ్రి హఠాన్మరణం తరువాత ఆయన కుమారుడిగా ముఖ్యమంత్రి పీఠం సహజంగా తనదే అవుతుందని భావించారు. దానిని అందుకోవడానికి బరితెగించి ఆయన పార్ధివదేహం  పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ ఆరంభిచారు. సానుభూతి పవనాల పల్లకీ మరొకరు ఎక్కకుండా ముందే విజ్ఞులు ఛీ అంటారని కూడా లెక్కచేయకుండా ముందుకు దూకి పార్టీ అధిష్టానంపై ఒత్తిడికి ప్రయత్నించారు. అయితే అధిష్ఠానం ఆ ఒత్తిడికి తలొగ్గకపోవడంతో కాంగ్రెస్ ను వీడి సొంత కుంపటి వైసీపీని ఆరంభించేశారు.   అదీ ఒక విధంగా బరితెగింపే. 

సరే  ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి   అడుగులు వేశారు.  తండ్రి కాలధర్మం చెందిన తరువాత ఓదార్పుయాత్ర పేరుతో ఆయన చేసిన విచిత్రం కూడా బరితెగింపే.   రాజశేఖర రెడ్డి గారి ళమరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వేలాదిమంది లక్షలాది మంది మరణించారు అని ప్రచారం చేసి వాళ్ళందరినీ ఓదార్చడం కోసం సుదీర్ఘయాత్ర చేసారు.  మహాత్మాగాంధీ హత్యానంతరం కూడా దేశంలో వేలాది గుండెలు ఆగిపోలేదు. కాని రాజశేఖర రెడ్డి   మరణం వలన వేలాది గుండెలు ఆగాయంటూ, సహజ మరణాలను కూడా  ఆ జాబితాలో వేసుకోవడానికి  జగన్ ఇసుమంతైనా వెనుకాడలేదు.  తండ్రి మరణం తరువాత రాష్ట్ర విభజన జరగడం, ఆ తరువాత ఎన్నికలలో జగన్ రెడ్డికి ఓదార్పు యాత్ర ఫలం దక్కలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పగ్గాలు అందుకున్నారు. ఆ తరువాత నుంచే జగన్  తనదైన మార్క్  రాజకీయాలకు తెరలేపారు. ప్రజల ఎమోషన్స్ రెచ్చగొట్టడం, వారి సానుభూతి కోసం ఏం చేయడానికైనా వెనుకాడకపోవడం కనిపించింది. 

గత ఎన్నికల ముందు కోడి కత్తి దాడి, సొంత బాబాయ్ వివేకా హత్య సంఘటనలను తనకు అనుకూలంగా మలచుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. అధికారపగ్గాలు అయితే అందుకున్నారు కానీ జగన్ అనుభవరాహిత్యం, అవగాహన లోపంతో ఆయన పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది.  ఆయన సర్కార్ జారీ చేసిన దాదాపు ప్రతి జీవోనూ కోర్టులు తప్పుపట్టాయి. ప్రతి నిర్ణయాన్నీ తప్పుపట్టాయి. ఇలా న్యాయస్థానాలలో ఇన్ని మొట్టికాయలు తిన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో మరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. జగన్ పాలన అంతా   ప్రతిపక్షాలను సాధించడం, ఆ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం, ప్రతి ప్రాజెక్టునూ నిర్వీర్యం చేయడంతోనే సరిపోయింది. ప్రజల ఆంకాంక్షల గురించిన పట్టింపు లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. ఇప్పుడు మళ్లీ గెలవడం తప్ప మరో లక్ష్యం లేదు జగన్ కు.  తన పాలన చూసి ఎవరూ ఓటు వేయరన్న విషయాన్ని ముందే గ్రహించిన జగన్ జనాలను బెదరించి ఓట్లు వేయించే లక్ష్యంతో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల డేటా మొత్తం వారి గుప్పెట్లో పెట్టి బెదరించో, బెల్లించో ఓట్లు దండుకునేందుకు వ్యూహం పన్నారు. ప్రజాప్రతినిథ్య వ్యవస్థలో అసలు చోటే లేని వ్యవస్థ ను తీసుకువచ్చి పార్టీ కార్యకర్తలకు వాలంటీర్లని పేరుపెట్టి ప్రభుత్వం గౌరవ వేతనాలు ప్రజాధనం నుండి ఎలా చెల్లిస్తారు? వాళ్ళు ఎన్నకైన ప్రజాప్రతినిధులనూ లెక్కచేయనంత పెత్తనం ఎలా చెలాయిస్తారు. ఇదంతా బరి తెగింపే కదా? ఈవాలంటీర్లసైన్యం వెనుక ఉన్ఞ లక్ష్యం ప్రభుత్వ వ్యవస్థలనూ ప్రతిపక్షాలనూ ఫ్రజలనూ భయోత్పాతానికీ అభద్రతకూ గురిచేయటం. తన అధికారాన్ని తిరుగులేకుండా చేసుకోవడానికే.    అయితే జగన్ బరితెగింపునకు ఎన్నికల సంఘం స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది. జగన్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరం చేసింది.

దీంతో ఇక జగన్ ఎన్నికలలో విజయం కోసం ఇంకెంత బరితెగిస్తారో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  వచ్చే ఎన్నికలలో జనం స్వేచ్ఛగా, నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు లేకుండా చేసే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇప్పటికే ఓట్ల జాబితాలో ప్రతిపక్షానికి చెందిన వారి ఓట్లు వేల సంఖ్యలో మాయ మయ్యాయని, అలాగే పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదయ్యాయనీ అంటున్నారు. జగన్ తన కోసం తన చేత తానే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారన్న విమర్శలు ఉన్నాయి. సరే ఓటర్ల జాబితాల సవరణలు, అవకతవకలకు పాల్పడిన, అందుకు దోహదపడిన అధికారులపై చర్యలు అంటూ ఏదో ఓ తంతు జరిగినా ఇప్పటికీ ఓటర్ల జాబితాలో అవకతవకలను పూర్తిగా సరిదిద్దలేదన్నదే పరిశీలకుల విశ్లేషణ. ఇంత ఆలస్యంగా వలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేయడం దొంగలు ఇంట్లో పడ్డాకా తలుపులు మూసిన తంతులా ఉందని అంటున్నారు.

అసలు జగన్ వై నాట్ 175 అనడంలోనే బరితెగింపు  ఉందని పరిశీలకులు అంటున్నారు. నోరెత్తే మనిషి లేకుండా చేసి, వ్యతిరేకించే వారి గొంతు నొక్కేసి , జనాల స్వేచ్ఛను హరించేసి, తన పార్టీకి ఓటు వేసే వాళ్లు మాత్రమే పోలింగ్ బూత్ వద్దకు చేరేందుకు వీలుగా శాంతి భద్రతల పరిస్థితిని నియంత్రించేందుకు కూడా జగన్ వెనుకాడరని పరిశీలకులు విశ్లేషిన్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన ఇన్ని రోజుల తరువాత కూడా రాష్ట్రంలో విపక్షాలపై దాడులు యథేచ్ఛగా జరుగుతుండటం ఇందుకు ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు. ఇటువంటి తరుణంలో  సర్వేల ఫలితాలు, తమ సభలకు వస్తున్న జన స్పందన చూసి విజయంపై ధీమాతో ప్రమత్తంగా ఉండకుండా తెలుగుదేశం కూటమి అప్రమత్తంగా వ్యవహరించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవలసిన ప్రమాదం ఏర్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.