హవ్వ.. రాష్ట్రానికి గూగుల్ జగన్ క్రెడిటేనంట?

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా ఉంది వైసీపీ తీరు. కింద పడినా మాదే పై చేయి అని చాటుకోవడానికి ఆ పార్టీ చేస్తున్న విన్యాసాలు నవ్వుల పాలౌతున్నాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ఐదేళ్ల కాలంలోనూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అధ: పాతాళానికి దిగజారిపోయేలా చేశారు. ఉన్న పరిశ్రమలను తరిమేశారు. కొత్తవి రాకుండా అడ్డగోలు విధానాలతో  అడ్డుకున్నారు. ఒక్క పారిశ్రామిక రంగం అనేమిటి? జగన్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ వెనుకబడిపోయింది. అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయింది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి గురించి పోరుగు రాష్ట్రం మంత్రులే జోకులేసేలా అప్పట్లో రాష్ట్ర పరిస్థితి ఉండేది.

అయినా సరే జగన్  మాత్రం అభివృద్ధి, సంక్షేమాలలో తామే మేటి అని నిస్సిగ్గుగా చాటుకునే వారు. అంతే కాదు.. జగన్ హయాంలో వీసమెత్తు అభివృద్ధి లేకపోయినా.. కొత్తగా రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాకపోయినా పట్టించుకునే వారు  కాదు కానీ, అంతకు ముందు చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల గురించి మాత్రం అదంతా తమ క్రెడిటేనని చాటుకోవడానికి  వైసీపీయులుఇసుమంతైనా వెనుకాడే వారు కాదు. అనంతపురంలో కియా మోటార్స్ రావడానికి చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ మాత్రం అసెంబ్లీ వేదికగా నిస్సిగ్గుగా కియా రాష్ట్రానికి రావడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని చెప్పుకున్నారు. ఒక్క కియా అనేమిటి, తమ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో అంతకు ముందు ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి అంతా తమ ఖాతాలోకి వేసుకోవడానికి ఇసుమంతైనా సంకోచించేవారు కాదు. 

ఇప్పుడు విశాఖలో గూగుల్ తన అతి పెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సర్కార్ తో ఒప్పందం చేసుకున్న తరువాత వైసీపీ మళ్లీ ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి తాపత్రేయపడుతోంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడానికి జగనే కారకుడని ఏ మాత్రం సిగ్గు లేకుండా చెప్పుకుంటోంది.    

 వైజాగ్‌లోని తన ఏఐ  హబ్ ద్వారా రాబోయే ఐదేళ్లలో   15 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని గూగుల్ మంగళవారం  అధికారికంగా ప్రకటించిన విషయం  తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం, గూగుల్ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి  అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ సమక్షంలో సంతకాలు జరిగాయి.  ఇంతటి స్థయిలో ప్రపంచ మేటి సంస్థ గూగుల్ నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ లపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఈ ఘనతను అంగీకరించలేక.. తనదైన శైలిలో ఫేక్ ప్రచారానికి తెగబడుతోంది.  

చంద్రబాబు నాయుడు దార్శనికతకు, అభివృద్ధి సంక్షేమం విషయంలో ఆయన ఆచరణాత్మక విధానాలను రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ప్రత్యర్థులు సైతం అభినందిస్తారు, ప్రశంసిస్తారు. అయితే వైసీపీ మాత్రం ఈ వాస్తవాన్ని అంగీకరించలేక ఫేక్ ప్రచారానికి దిగి నవ్వుల పాలౌతోంది.  గూగుల్ డేటాసెంటర్ విశాఖకు రాబోతోందనగానే.. వైసీపీ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదన్న వాదనను తలకెత్తుకుంది. అయితే, ఆ ప్రచారం ఎందుకూ పనికిరాకుండా పోవడం.. చంద్రబాబు, లోకేష్ ల బ్రాండ్ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోవడంతో.. వైసీపీ ఇక కొత్త ప్రచారానికి తెరతీసింది. అదేమిటంటే.. రాష్ట్రానికి గూగుల్ తరలిరావడానికి జగనే కారణమనీ, ఇందులో చంద్రబాబు ఘనతేమీ లేదనీ తన భుజాలను తానే చరిచేసుకోవడం మొదలెట్టిది. ఇంతకీ వైసీపీ వాదనేంటంటే.. కొన్నేళ్ల కిందట జగన్ అదానీని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ..  ఆ భేటీలోనే గూగుల్ డేటా సెంటర్  ఏపీకి తీసుకురావాలని జగన్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే ఫలించి ఇప్పుడు గూగుల్ వైజాగ్ కువచ్చింది.

అయితే ఈ వాదన వైసీపీ నవ్వుల పాలు కావడానికి తప్ప మరొకందుకు ఉపయోగపడలేదని పరిశీల కులు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నసమయంలో  రాష్ట్రంలో ఒక్కకంటే ఒక్క ప్రధాన ఐటీ కంపెనీ వచ్చిదా?  అసలు ఏ కంపెనీ అయినా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తైనా చూసిందా? అంటూ జనమే వైసీపీ వాదనను పూర్వపక్షం చేస్తున్నారు.  నెటిజనులు వైసీపీ వాదనను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక రాజకీయ పరిశీలకులైతే.. వైజాగ్ కు గూగుల్ తరలిరావడం చంద్రబాబు ఘనతే అని వైసీపీ అంగీకరించలేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చునని అంటూనే.. ఈ సమయంలో వైసీపీ ఫేక్ ప్రచారానికి దిగకుండా మౌనం వహిస్తే ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకూ మంచిదని సలహా ఇస్తున్నారు.