కలిసొస్తే పవన్ తో.. లేకుంటే ఒంటరిగా!
posted on Jun 2, 2023 11:32AM
ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అడుగులు ఎటుగా పడుతున్నాయో, ఇప్పటికే కొంత స్పష్టత వచ్చింది. కలిసొస్తే పవన్ కళ్యాణ్ తో కాదంటే ఒంటరిగా... ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మరోవంక పవన్ కల్యాణ్ వందకు రెండొందల శాతం తెలుగు దేశం పార్టీతో పొత్తుకు సిద్దమయ్యారు. సో అటు బీజేపీ, ఇటు జనసేన అలాగే, టీడీపీ ఆలోచనలు ఇదే విధంగా కొనసాగితే, ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవంక బీజేపీ అడ్డు తొలిగి పోవడంతో తెలుగు దేశం, జనసేన కూటమి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని వామపక్షాలు ఇతర పార్టీలు టీడీపీ కూటమితో చేతులు కలిపితే ఇక టీడీపీ, జేనసేన కూటమి గెలుపునకు తిరుగుండదని పరిశీలకులు భావిస్తున్నారు.
అదలా ఉంటే బీజేపీ ఒంటరిగా మిగిలినా వైసీపీతో సీక్రెట్ సంసారం సాగించినా రాష్ట్రంలో బీజేపీకి ఉన్నదీ లేదు, పోయేదీ లేదనీ, ఆపార్టీ ప్రత్యక్షంగా ఎన్నికలను ప్రభావితం చేసే పరిస్థితిలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువగా ఒక శాతం లోపు ఓట్లు తెచ్చుకున్న కమలం పార్టీ ఈసారి ఒంటరిగా వెళితే ఆ మాత్రం ఓట్లు కూడా రావని పరిశీలకులే కాదు బీజేపీ నాయకులు సైతం అంటున్నారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రత్యేక హోదాను బీజేపీ నాయకత్వం ముగిసిన అధ్యాయం అని తేల్చేసినప్పుడే, రాష్ట్రంలో బీజేపీ చరిత్ర ముగిసిపోయిందననీ బీజేపీ అభిమానులు, కార్యకర్తలు సహా అందరూ అంగీకరిస్తున్నారు.
అదలా ఉంటే,ఇప్పటికే ఒకసారి హస్తం పార్టీ మాజీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించి అభాసు పాలైన బీజేపీ ఇప్పుడు మళ్ళీ అదే విఫల ప్రయోగానికి తెర తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన కమలదళం చేస్తోందని అంటున్నారు. అయితే ఎనిమిది సంవత్సరాలకు పైగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పై బీజేపీ ఆశలు పెంచుకోవడం ఆత్మహత్యా సదృశ్యమనే విచారం సంఘ్ పరివార్ వర్గాల్లో వినవస్తోంది.
మరోవంక కాలం చెల్లిన రాజకీయ నాయకుడిగా తనకు తానుగా ముద్రవేసుకుని ఒక విధంగా రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి అన్ని రకాల రుగ్మతలతో చతికిల పడిన పార్టీని పరుగులు తీయించగలరా? అది అయ్యే పనేనా? అంటే ఇటు పార్టీ వర్గాలు,అటు రాజకీయ పరిశీలకుల నుంచి కాదనే సమాధానమే వస్తోంది. అయితే, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి కొందరు విశ్లేషకులు మాత్రం మోడీషా జోడీ నాయకత్వంలోని బీజేపీకి తివిరి ఇసుమున తైలంబు తీసే సామర్ధ్యం ఉందని అంటున్నారు. నిజానికి, పార్టీ పరిస్థితి ఏపీ కంటే అద్వాన్నంగా అస్సాం, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ నేరుగా అధికారంలోకి వచ్చిన విషయాన్ని, అదే విధంగా 33 ఏళ్ళు లెఫ్ట్ ఫ్రంట్ పాలించిన పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రాకున్నా,లెఫ్ట్, కాంగ్రెస్ కూటమిని జీరో కు నెట్టేసి, 70కి పైగా అసెంబ్లీ స్థానాలతో బీజేపీ అధికార తృణమూల్ కు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.
అయితే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల విద్యలు దక్షిణాదిన పనిచేయవని కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగులేని విజయం నిరూపించిన నేపధ్యంలో ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు,కేరళ రాష్ట్రాలలో కమలం పార్టీ కాషాయ రాజకీయాలు సాగవనే వాదన కూడా లేక పోలేదు. అదెలా ఉనా కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం విషయంలో బీజేపీ వర్గాల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి అవుట్ డేటెడ్ పొలిటీషియన్, కాలం చెల్లిన రాజకీయ నాయకుడు. అదెలా ఉన్నా వంటి నిండా నరనరాన కాంగ్రెస్ రక్తం నింపుకున్న నాయకుడు. అనేక సందర్భాలలో అసెంబ్లీ లోపలా బయటా కూడా బీజేపీను తూలనాడిన నాయకుడు.
అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని అనుకోవడం లేద ని పార్టీ పాత తరం నేత ఒకరు చిన్నగా నవ్వేశారు. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యారేకానీ, ఆయనకు రాష్ట్రంలో కాదు, కనీసం ఆయన సొంత జిల్లా చిత్తూరులో కూడా పెద్దగా పట్టున్న నాయకుడు కాదు. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక, ఆఖరి బంతి అదీ ఇదని చివరి క్షణం వరకు ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కుని కూర్చున్నారు. అందుకే రాష్ట్ర విభజన క్రతువు మొత్తం శాస్త్రోత్రంగా అయ్యే వరకు ఆగి అప్పుడు రాజీనామా చేసిన ఆయన పెట్టిన సమైక్యాంధ్ర పార్టీని ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి, సొంతంగా సమైక్యాంధ్ర (చెప్పుల) పార్టీ పెట్టి 2014లో పోటీ చేసిన ఆయనకు 175 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కలేదు.
ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇంచు మించుగా దశాబ్ద కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సో .. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించినా రాష్ట్రంలో కమల దళం వికసించే అవకాశం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా, ఆయనకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ... అది తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో అస్త్రం ఇచ్చినట్లవుతుందని అంటున్నారు.