అలా విమర్శిస్తే దైవ ద్రోహం.. ప్రతిపక్షాలపై యనమల ఫైర్
posted on Oct 24, 2015 5:02PM
.jpg)
ఏపీ ప్రతిపక్షాల తీరుపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ ఏపీ ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో.. దానిని వ్యతిరేకిస్తూ నిన్న వైకాపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టడాన్ని యనమల తప్పుబట్టారు. మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకే గూటికి చెందిన పక్షులని అన్నారు. అంతేకాదు ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ ఎంతో గౌరవంగా మట్టిని, పవిత్రమైన గంగా నది జలాన్ని తీసుకొస్తే దాన్ని విమర్సిస్తారా.. భూదేవిని, గంగను విమర్శించడం దైవ ద్రోహమని మండిపడ్డారు. శంకుస్థాపనకు మొత్తం పదమూడు వేల గ్రామాల నుండి మట్టి తీసుకొచ్చారని వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కించపరచకూడదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాలతో గొడవ పడటం వల్ల సాధించేది ఏదీ లేదని వ్యాఖ్యానించారు.