మ‌ద్యంషాపు లొల్లి.. కొట్టుకున్న మ‌హిళ‌లు

మ‌హిళ‌లు గుంపులుగా క‌లిసి గుడికి వెళ‌తారు, పెళ్లీ పెరంటాల‌కీ వెళుతూంటారు.  పంపుల ద‌గ్గ‌ర గొడ‌వ‌కీ దిగుతూంటారు. దీనికి మ‌రి కాస్త ఆవేశాన్ని జోడిస్తే  మ‌ద్యం దుకాణాన్ని ఎందుకు తీశార‌ని ఏకంగా కొట్ట‌డానికే వెళ్లారు. ఇది ఢిల్లీలో ఇటీవ‌ల జ‌రిగింది. ఇటీవ‌ల మ‌ద్యం దుకాణాలు నివాస ప్రాంతాల్లో వెలిసి   స్థానికులకు ఇబ్బంది క‌రంగా మారాయి. తాగుబోతుల గోల‌తో ప్రాంతీయ మ‌హిళ‌లు, పెద్ద‌లు నానా ఇబ్బందులు పడుతూంటారు.

అస‌లు ఆ దుకాణాలు,. చిన్న చిన్న బార్ల‌కు   ప‌ర్మిట్‌లు ఇచ్చిన‌వారిని చ‌చ్చేట్టు కొట్టాల‌న్న ఆగ్ర‌హం ఆయా ప్రాంతాల్లోని మ‌హిళ‌లు వ్య‌క్తం చేయ‌డంలో త‌ప్పే లేదు. ఎందుకంటే ఇబ్బందులు, క‌ష్ట న‌ష్టాలూ ఎదుర్కొనేది వారే గ‌నుక‌. ఢిల్లీలో స‌రిగ్గా ఇదే జ‌రిగింది. మహిళలు మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాలలో తరచుగా నిరసనలు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో మద్యం దుకాణాలపై దాడులు కూడా చేస్తుంటారు. రాళ్లు రువ్వుతుంటారు.

వైన్ షాపు ముందు కూర్చోని నిరసనలు కూడా తెలియజేస్తుంటారు. ఇలాంటి సందర్భా ల్లో తోపులాటలు, పరస్పర దాడులు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.గురువారం అర్దరాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఢిల్లీలోని ఒక వైన్‌షాప్‌ బయట  రెండు వర్గాల మహిళల  మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. మద్యం షాపుకు ఎదురుగా ఉన్న భవనం నుండి చిత్రీకరించిన వీడియోలో మహిళా బౌన్సర్లు, నలుపు రంగులో, మహిళా నిరసనకారులను తన్నడం, కొట్టడం కనిపించింది. అదే విధంగా అక్కడ అరుపులు, కేకలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో ఓ పోలీసు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.  ఆ ప్రాంతంలో మద్యం దుకాణం తెరవడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు కొందరు నిరసనకు దిగడంతో గొడవ మొదలైంది.

  స్థానిక మహిళలు అక్కడికి వచ్చి మూసేయాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్ లు, మహిళలపై దాడులు చేశారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో.. కొంత మంది స్థానిక పోలీసులు దీన్ని అడ్డుకొవడానికి ప్రయత్నించారు. దక్షిణ ఢిల్లీలోని తిగ్డి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతడిపై కూడా మహిళలు దాడిచేశారు. అతని యూనిఫాం  చిరిగిపోయిం ది.

వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ కేసులో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. క్షతగాత్రులను ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.  కానీ ఇలాంటివి ఎన్ని జ‌రిగినా ప్ర‌భుత్వాలు బొత్తిగా ప‌ట్టించుకోవ‌డం లేదు. వారికి ఆ దుకాణాల మీద వ‌చ్చే ఆదాయం ముందు  ప్ర‌జ‌ల  ప్రాణ, ఆస్తి న‌స్టాలు చిన్న‌వే!