అమ్మా బ‌య‌లెల్లినాదే.. ర‌ష్మ‌మ్మా బయలెల్లినాదే!

ఆస్తి కోసం కొట్టుకుచ‌చ్చే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య‌కు వివాదం చ‌ల్ల‌బ‌రిచేందుకు కోడళ్ల‌ను గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగేలా చేయ‌మ‌ని   అత్త‌గారు రంగంలోకి దింపేర‌ట. ఇంటి గుట్టు బ‌య‌ట‌కు ఇప్ప‌టికే బాగా ప్ర‌చార‌మై క‌థ‌లు, న‌వ‌ల‌ల స్థాయికి చేరుకోవ‌డంతో స్త్రీ శ‌క్తి రంగంలోకి దిగితేనే ప‌రిస్థితులు కాస్తంత అనుకూలిస్తాయ‌ని ఉద్ధ‌వ్ థాక్రే  భార్య ర‌ష్మీ థాక్రే రంగంలోకి దిగారు. ఇది క‌నీ వినీ ఎరుగ‌ని సంగ‌తి. మామూలుగా ఎన్నిక‌ల్లో భ‌ర్త‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలోకి దిగ‌డానికి ఇంట్లో ప‌నులు పిల్ల‌ల‌కు  చెప్పి ప్ర‌చార వేదిక‌ల‌ను, వాహ‌నాల‌ను ఎక్కి  ప్ర‌సంగించి జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డం, త‌ద్వారా భ‌ర్త‌కు ఓటు వేయ‌మ‌ని చ‌క్కగా  కోర‌డం చాలా కాలం నుంచి వున్న‌దే. వారి ప్ర‌భావం ఏ మేర‌కు వుంటుంది అనేది వేరే విష‌యం. 

కానీ వారిని కూడా వెంట తిప్పుకోవ‌డం, వారితో  పాద యాత్ర చేయ‌డం, ఇళ్ల‌కు వెళ్లి మ‌హిళ‌ల‌కు చీర‌లు, కుంకుమా ఇవ్వ‌డం  ఆన‌వాయితీగా మారింది. విన‌డానికి, చ‌ద‌వ‌డానికి వింత‌గా హాస్యంగా వుండ‌వ‌చ్చుగాని ఇది వార్డు స‌భ్యులను గెలుచుకోవ‌డానికి కూడా గొప్ప అస్త్రంలా పార్టీలు అనుస‌రిస్తున్న  రాజ‌కీయ వ్యూహం. అమ్మ‌గారు వ‌చ్చార‌ని విని చ‌క్క‌గా అర్ధంచేసుకున్న‌ట్టు న‌టించి మ‌రీ భ‌ర్త‌ల‌చేత బ‌ల‌వంతంగానైనా ఓటు వేయించ‌డం జ‌రిగింది, జ‌రుగుతోంది. దేన్న‌యినా అటునుంచి న‌రుక్కుర‌మ్మ‌న్నారు గ‌దా!

స‌రిగ్గా ఇదే సూత్రాన్ని థాక్రేగారూ అనుస‌రిస్తున్నారంతే.. ఇందులో త‌ప్పేమీ లేదు. ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిందేమీ లేదు. కాబోతే ఇక్క‌డ కొత్త‌గా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిందేమిటంటే.. ర‌ష్మీ మేడ‌మ్ శివ‌సేన రెబెల్స్ ఎమ్మెల్యేల భార్య‌ల‌కు   జ్ఞాన‌బోధ  చేయ‌డానికి బ‌య‌టికి వ‌చ్చేరు. అంటే భ‌ర్త‌ల‌కు రాష్ట్ర ప‌రిస్థితులు   వివరించి చెప్పి, కోరి కోరి క‌ష్టాలు కొనితెచ్చుకోవ‌ద్ద‌ని న‌చ్చ‌జెప్పి ‘మ‌నింటికి’ తీసుకుర‌మ్మ‌ని చెప్ప‌డానికి మేడ‌మ్ కొంగు బిగించారు. 

శివసేన రెబల్ ఎమ్మెల్యేలను వారి భార్యలతోనే నచ్చచెప్పించే ప్రయత్నాలను ఉద్ధవ్ థాకరే సతీమణి రష్మి థాకరే  చేపట్టారు. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో రష్మి సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరో వైపు ఉద్ధవ్ థాకరే సైతం గౌహతిలోని హోటల్‌లో బస చేసిన పలువురు రెబల్ ఎమ్మెల్యేలకు సందేశాలు పంపుతున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ తంత్రం ఏ మేర‌కు పారుతుంద‌నేది చూడాలి.

కాబోతే  తెలుగు రాష్ట్రాల వ్య‌వహారం కాదు. వెంట‌నే ఆడోళ్లు వ‌చ్చి చెబుతుండారు మ‌నం ఇనుకోవాల అనుకోవ‌డానికి. అది మ‌రాఠా రాజ్యం. వ్య‌వ‌హారం మ‌రి వేరుగానే వుంటుంది. మ‌హిళ‌ల్ని త‌న ఇంట్లో పేరంటానికి పిలిచిన‌ట్టు పిలిచి అవీ ఇవీ మాట్లాడుకుంటూ ఏమ‌మ్మా వ‌దిన‌మ్మా కాస్తంత మీ ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్పి ఏదో ఈసారికి ఇలా కానిద్దామ‌ని మ‌ళ్లీ అన్న‌గారి ద‌గ్గ‌రికి ర‌మ్మ‌ని అనొచ్చు. అలా మ‌రి ఆ వ‌దిన‌లంతా ఒకే అంటారా అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌. ఎందుకంటే వ‌దిన‌ల కంటే అన్న‌లు శివ‌సేన నాయ‌కుడు థాక్రేకి ఆప్ష‌న్లు ఇచ్చి మ‌రీ అక్క‌డెక్క‌డో వెళ్లి కూర్చున్నారాయె‌! ఎలా కుదురుతుంది? మ‌రి ర‌ష్మీ మేడ‌మ్ ఏ ధైర్యంతో కొంగు బిగించి బ‌య‌ల్దేరారో ఏ ధ‌ర్మ‌సూత్రం బోధించి, బుజ్జగిస్తారో చూడాలి.