ఆ నాలుగు పథకాలూ గట్టెక్కిస్తాయా?

తెలంగాణలో రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో రేవంత్ సర్కార్ విజయాలూ, ఫెయిల్యూర్స్ సమానంగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి ఆనవాలు కూడా కనిపించకుండా చేసుకోవడంలో రేవంత్ సక్సెస్ అయితే.. వాగ్దానాల అమలు విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పథకాల అమలుపై దృష్టి సారించారని చెబుతున్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు రాజనున్నాయి. ఆ ఎన్నికలలో గట్టెక్కాలంటే ఏదో విధంగా పథకాలు సక్రమంగా అమలు చేయగలుగుతున్నారన్న భావన ప్రజలలో కలగాలి. లేకపోతే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదు. పంచాయతీ ఎన్నికలలో విఫలమైతే.. రేవంత్ కు కష్టాలు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ గట్టిగా మద్దతు ఇస్తూ వచ్చిన హైకమాండ్  పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొంచం అటూ ఇటూ అయితే.. అసమ్మతి, అసంతృత్తి ఉధృతిని అణిచివేసి రేవంత్ కు సపోర్ట్ గా నిలబడటంపై పెద్ద ఆసక్తి చూపే అవకాశలు పెద్దగా ఉండవు.

దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి తాజాగా అంటే రిపబ్లిక్ డే  రోజుల ప్రారంభించిన పథకాల అమలుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నాలుగు  పథకాలను పక్కాగా అమలు చేస్తేనే ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది.   రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలు చాలా వరకూ రసాబాసగా మారిన సంగతి తెలిసిందే. దానిని బట్టే పథకాల అములు విషయంలో లబ్ధిదారుల్లో ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది.  దీనిని గ్రహించే రేవంత్ రెడ్డి విడతల వారీగా వీటి అమలుకు నిర్ణయించారు. తొలి దశలో  563 మండలాల్లోని 563 గ్రామాల్లో ఈ పథకాల అమలుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది.  

 4,41,911 మంది రైతులకు పెట్టుబడిసాయం కింద సోమవారం (జనవరి 27) రైతుభరోసా రూ 6 వేలు  రైతుల ఖాతాలో జమ చేసింది.  అలాగే ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకంలో  భాగంగా 18,180 మంది రైతుకూలీలకు రు.6 వేలుచొప్పున రు. 10.91 కోట్లు జమచేసింది. బీఆర్ఎస్ హయాంలో వ్యవసా యకూలీలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న సంగతి విదితమే. ఇక మూడోపథకంగా కొత్తగా 15,414 రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కొత్తకార్డుల వల్ల 51,912 కుటుంబాలు లబ్దిజరిగింది. అలాగే కుటుంబాల్లో కొత్తసభ్యులను చేర్చాలని వచ్చిన దరఖాస్తుల్లో 1.03 లక్షల కార్డుల్లో కొత్తసభ్యుల పేర్లను మార్చింది. చివరగా గూడులేని అర్హులైన నిరుపేదలు 72 వేలమందికి ఇందిరమ్మ ఇళ్ళపథకంలో యాజమాన్య పత్రాలను అందించింది. 

 స్ధానిక సంస్ధల ఎన్నికలలో విజయం లక్ష్యంగానే  రేవంత్ ప్రభుత్వం ఈ  నాలుగు పథకాల అమలుకు గట్టిగా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు పైలట్ ప్రాజెక్టులో పరిమితంగానే అమలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎన్నికలలోపు ఈ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడందాని తర్వాతే స్ధానికసంస్ధల ఎన్నికలను నిర్వహించాలన్నది రేవంత్ ఆలోచనగా పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందుకనే ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసిన 563 గ్రామాల్లో పథకాల అమలుకు శ్రీకారంచుట్టింది. పైలెట్ ప్రాజెక్టు అమలుసరే పైనాలుగుపథకాలు యావత్ రాష్ట్రంలో వివాదాలకు తావులేకుండా ఎప్పుడు అమలవుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu