స్థానిక ఎన్నికలు సజావుగా సాగుతాయా?
posted on Jun 27, 2025 11:32AM

తెలంగాణ రాజకీయాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఓ వంక ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దుమారం రేపుతుంటే.. మరో వంక గత బీఆర్ఎస్ ప్రభుత్వ, ‘ఘన’ చరిత్రకు అద్దం పట్టే, ప్రతిష్టాత్మక’ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫార్ములా - ఈ కార్ రేస్ ఇతరత్రా అవినీతి కేసులు, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఏ రోజుకు ఆరోజు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. అదొకటి అలా ఉంటే.. అన్ని పార్టీలకూ, మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్ష కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు తరుము కొస్తున్నాయి. 2019లో ఎన్నికల్లో కొలువు తీరిన స్థానిక సంస్థలు కాలం చేసి, సంవత్సరం పైగానే అయినది. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ.. స్థానిక ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. ఇక ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేకుండా రాష్ట్ర హై కోర్టు ఎన్నికలను పదేపదే వాయిదా వేయడాన్ని తప్పుపడుతూ, సర్కార్ నెత్తిన అక్షితలు వేయడంతో పాటుగా , 90 రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాలని ప్రభుత్వానికి గడవు విధించిది.
ఈ నేపధ్యంలో ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. రాష్ట్ర హై కోర్టు విధించిన 90 రోజుల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరో వంక ఎటు తేలని బీసీ రిజర్వేషన్ వ్యవహారం, సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఉన్నది. ఈ పీటముడిని విప్పితేగానీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితి లేదు. అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనసులో ఏముందో ఏమో కానీ.. ఈరోజుకు కూడా రిజర్వేషన్లపై ఎటూ తేల్చకుండా నాన్చివేత ధోరణి అవలబిస్తోంది. అదలా ఉంటే 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని, లేదంటే.. అంటూ బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇలా ఎటు చూస్తే అటు పటు నిరాశ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో చిక్కుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
అదొకటి అయితే.. ఏదో ఒకటి చేసి, కోర్టు ఆదేశాల ప్రకారం, 90 రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించినా.. ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో అధికార పార్టీలో అనుమనాలు తొలగడం లేదని అంటున్నారు. కాంగ్రెస్ ముఖ్యనాయకులు, పొరుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్టైల్లో స్థానిక ఎన్నికలను స్వీప్ చేస్తామని చెపుతున్నా.. పార్టీ అంతర్గత సర్వేల ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. ఫలితాలు కూడా అలాగే ఉంటాయనే భయాన్ని వ్యక్త పరుస్తున్నారు.
నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లోనే కాదు.. పార్టీలోనూ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు సప్ష్టంగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రికే తమ మంత్రుల పనితనం మీద విశ్వాసం లేదని, ఇక ప్రజలకు ప్రభుత్వం పై విశ్వాసం ఎలా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. నిజంగా కూడా సామాన్య ప్రజలు.. ముఖ్యంగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం స్వచ్చందంగా పనిచేసిన వివిధ వర్గాల ప్రజలు.. ముఖ్యంగా నిరుద్యోగ యువత, పేద మహిళలు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి మహిళలు కూడా.. కాంగ్రెస్ పార్టీని సొంత చేసుకునేదుకు, సమర్ధించేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. ముఖ్యంగా.. మహిళలకు ఇచ్చిన ప్రత్యేక హామీలు ఏవీ అమలు కాకపోవడంతో మహిళల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువ ఉందని అంటున్నారు. స్థానిక ఎన్నికలో మహిళా వ్యతిరేకత ప్రభావం భారీగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
అలాగే.. ఎన్నికల హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణి, రుణ మాఫీ, రైతుభరోసా సహా ఏ ఒక్క పథకాన్ని సంతృప్తి కరంగా పూర్తి చేయక పోవడంతో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి తారస్థాయికి చేరిందని అంటున్నారు. ఈ నేపధ్యంలో,కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పాటించి ఎన్నికలకు వెళుతుందా? అన్న అనుమానాలు కూడా విపక్షాలు వ్యక్త పరుస్తున్నాయి. అయితే.. ప్రభుత్వం ఎన్నికలు మరో సారి వాయిదా వేసే ఆలోచన చేయక పోవచ్చని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహిస్తుందా? లేక, ఏపీలో జగన్ రెడ్డి నిర్వహించిన అరాచక, అప్రజాస్వామిక పద్దతిలో మమ అనిపిస్తుందా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయని అంటున్నారు.