తెలంగాణ కేబినెట్ భేటీ.. మునుగోడుపై చర్చ జరిగేనా?

తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం (ఆగస్టు 11) మరి కొద్ది గంటలలో జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీలో మునుగోడు కేంద్రంగానే చర్చ జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్ సీరియస్ గా పట్టించు కోవడం లేదనీ, అది జస్ట్ ఉప ఎన్నికే అని వ్యాఖ్యానించారనీ పార్టీ వర్గాలు చెబుతున్న వేళ.. ఈ కేబినెట్ సమావేశంలో ప్రముఖంగా చర్చించే అంశాలేమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. రష్ట్రంలో రాజకీయ వాతావరణం హీట్ ఒక వైపు.. ఆర్థిక ఇబ్బందులు మరోవైపు నెలకొని ఉన్న నేపథ్యంలో కేబినెట్ లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అంశాలపై పార్టీలోనే పలు అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో నిధుల సమీకరణ, పథకాల అమలు, ప్రాజెక్టులు, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రం ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపైనే ప్రధానంగా కేబినెట్ దృష్టి సారించే అవకాశం ఉందంటున్నారు.  ఏందుకంటే 2022-2023 బడ్జెట్ లో ఏకంగా రూ. 45వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. ఈ లోటును పూడ్చుకోవడం ఎలా అన్నదానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని కొందరు మంత్రులు కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.

అలాగే పథకాల అమలు, ప్రాజెక్టుల పనులపై నా,   ఆగస్టు 15 నుంచి కొత్తగా ఇవ్వనున్న  పింఛన్లు, దళిత బంధు పథకం రెండో విడత అమలుపై తదితర అంశాలను చర్చించి కేబినెట్ ఆమోదిస్తుందని చెబుతున్నారు. ఇక  జాతీయ రాజకీయాలపైన కేబినెట్ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఢీ అంటే ఢీ అన్నట్లుగా కేంద్రంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంను సైతం బహిష్కరిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.  నీతి ఆయోగ్ సమావేశంకు బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం హాజరుకాకపోవటం, మరుసటి రోజే బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తదితర అంశాలపై కేసీఆర్ కేబినెట్ సహచరులకు వివరిస్తారని చెబుతున్నారు.