తెలంగాణలో పానీపూరి డిసీజ్!

తెలంగాణలో కొత్త రోగం వెలుగులోకి వచ్చింది. ఆ రోగం పేరు పానీపూరీ డిజీస్. ఇదేం కొత్త రోగం కాదు. టైఫాయిడే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఈ టైఫాయిడ్ జ్వరాలు పానీపూరీ తినడం వల్లనే వస్తున్నాయట. అందుకే ఇప్పుడు వస్తున్న టైఫాయిడ్ జ్వరాలకు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు పానీపూరీ డిసీజ్ అని నామకరణం చేశారు.

పానీ పూరీ వల్ల టైఫాయిడ్ జ్వరాలతో పాటు పచ్చ కామెర్లు, పేగులలో మంట వంటివి కూడా సంక్రమించే ముప్పు ఉందని చెబుతున్నారు. పానిపూరి కారణంగా ఇప్పటి వరకూ కనీసం 2700 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయన్నారు. ప్రజారోగ్యానికి ఇంత హాని చేస్తున్న పానీపురీని మాత్రం నిషేధించలేదు.

నిజమే  రాష్ట్రంలో పానీపూరీ బండ్లపై ఎలాంటి నిషేధం లేదు. ప్రతి గల్లిలోనూ పానీపూరీ బండ్లు కనిపిస్తూనే ఉంటాయి. పరిసరాల శుభ్రతతో సంబంధం లేకుండా.. ఈగలు ముసురుతున్న జనం గుంపులు గుంపులుగా ఆ బండ్ల ముందు నిలబడి పానీపూరీలు లాగించేయడం నిత్యం కనిపించే దృశ్యమే. అయితే నిషేధించరట కానీ.. పానీపూరి తినకుండా ఉండటమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అంటున్నారు.

ఇటీవలి కాలంలో పలు టైఫాయిడ్ జ్వరాలకు పానీపూరితో లింకుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీవివాసరావు అన్నారు.  తోపుడు బండ్లపై విక్రయించే పానీ పూరీ తింటే ఆరోగ్యంపై ప్రభావం చూపడం తథ్యమని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల మీద బండిపై పానీ పూరి లు ఇష్టంగా లాగించేయడం మానుకోవాలని ప్రజలకు సూచించారాయన. అలాగే పానీ పూరి తయారీదారులు, బండ్లపై వాటిని విక్రయించేవారు  శుభ్రత పాటించాలన్నారు.  

పానీపూరీలో కలిపేందుకు వాడే నీటిని కాచి వడ పోయాలని, అలాగే వాటిని బండ్లపై విక్రయించే వారు  పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. అంతే కానీ.. ప్రజారోగ్యానికి చేటు చేస్తున్న పానీపూరి విక్రయాలపై నిషేధం విధించే యోచన మాత్రం చేయడం లేదు. పైగా  మూడు, నాలుగు రోజులు జ్వరం ఉంటే  డాక్టర్‌కు చూపించుకోవాలని, వారి సూచన మేరకు తగు పరీక్షలు చేయించుకోవాలని ప్రజల హెచ్చరించారు. జాగ్రత్తలు పాటించకపోతే, జిహ్వచాపల్యాన్ని అరికట్టుకోకుంటే. . వేల రూపాయలు ఆసుపత్రి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని శ్రీనివాసరావు చెబుతున్నారు.