అందమైన దాంపత్యం

అనగా అనగా ఒక అన్యోన్యమైన జంట. వాళ్లిద్దరినీ చూసి చుట్టుపక్కల వాళ్లందరికీ ముచ్చటగా ఉండేది. అలాగని వారు అందరికంటే అందంగా ఉండేవారని కాదు! ఎప్పుడూ కొట్టుకోకుండా ఉండేవారనీ కాదు! కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా కలిసిమెలిసి ఉండేవారు. అలాంటి వారిద్దరి మధ్యా ఒక కథ నడిచింది...

 

ఒక రోజు భర్త ఇంటికి వస్తూనే ‘నేను ఇవాళ దాంపత్యం గురించి ఒక అద్భుతమైన ఉపన్యాసం విని వస్తున్నాను’ అన్నాడు. ఏం చెప్పారేంటి ఆ ఉపన్యాసంలో!’ అంటూ ఆసక్తిగా అడిగింది భార్య. ‘భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదంట. అందుకోసం ఒకరిలో ఒకరికి నచ్చని విషయాలు ఏమన్నా ఉంటే, వాటి గురించి ముందుగానే చర్చించుకుని తేల్చుకోవాలంట!’ అంటూ చెప్పుకొచ్చాడు భర్త. భార్య ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ‘ఈ ఉపన్యాసం విన్న తరువాత నాకు ఓ ఉపాయం తట్టింది. ఇవాళంతా కూర్చుని నీలో నచ్చని విషయాలు ఏమున్నాయో, ఒక కాగితం మీద రాస్తాను. నువ్వు కూడా నాలో నచ్చని విషయాలు ఏమేం ఉన్నాయో ఒక కాగితం మీద రాసి ఉంచు. అలా కాగితాలలో రాసుకున్న లోపాల గురించి రేపు చర్చించుకుందాం’ అంటూ హడావుడిగా గదిలోకి వెళ్లి ఒక పెన్నూ, కాగితం పట్టుకున్నాడు.

 

మరుసటి రోజు ఉదయం వేళకి భర్త వంటింట్లోకి ఒక మూడు కాగితాలు తీసుకువచ్చాడు. ‘నీలో నాకు నచ్చని విషయాల జాబితా ఒకటి తయారుచేశాను. అవన్నీ చదువుతాను విను’ అంటూ బడబడా ఆ మూడు కాగితాలలో రాసిన ‘భార్యలోని లోపాలను’ చదవసాగాడు. జాబితాని చదవడం పూర్తయిన తరువాత హుషారుగా ‘ఇప్పుడు నీ జాబితాని కూడా చదువు. తరువాత వాటిలో విషయాల గురించి చర్చించుకుందాం.’ అన్నాడు భర్త. భార్య మాత్రం నిశ్శబ్దంగా ఒక కాగితాన్ని తీసుకుని భర్త చేతిలో పెట్టింది. ఆశ్చర్యం! అది ఖాళీగా ఉంది. ‘అదేంటీ నువ్వు రాసేందుకు నాలో ఒక్క లోపం కూడా కనిపించలేదా!’ అని అడిగాడు భర్త.

 

‘నేను కూడా మీలో లోపాలని రాద్దామనే కూర్చున్నాను. కానీ మన బంధాన్ని నాశనం చేసేంతటి లోపాలు ఏవీ మీలో కనిపించలేదు. ఒకవేళ ఏదన్నా చిన్న లోపం కనిపించినా, ఒకోసారి దాని వల్ల ఉపయోగం కూడా కనిపించేది. పోనీ మీలో నాకు నచ్చని విషయాలను రాద్దామా అంటే... నాకు నచ్చనంత మాత్రాన వాటిని లోపాలుగా ఎలా అనుకోగలను. మీరు మీలాగా ఉంటే చాలు అనిపించింది. ఎప్పటిలాగే ప్రేమని పంచుతూ, బాధ్యతగా చూసుకుంటే ఉంటే చాలనిపించింది,’ అంది భార్య. భర్తకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ కళ్ల నుంచి నీరు ఆగలేదు. అంత ఉద్వేగంలో కూడా, తన చేతిలో ఉన్న కాగితాలను చించడం మాత్రం మర్చిపోలేదు.

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)


- నిర్జర.