ర‌ఘురామ‌కు 3 ల‌క్ష‌ల మెజార్టీ!!.. న‌ర్సాపురం స‌ర్వేలో సంచ‌ల‌నం..

ర‌ఘురామ త‌గ్గేదేలే అంటున్నారు. జ‌గ‌న్ ప‌త‌నం త‌న‌తోనే ఆరంభం అంటున్నారు. వేటు వేస్తారా?  తానే రాజీనామా చేయాలా? అంటూ తొడ‌కొట్ట‌కుండానే స‌వాల్ చేస్తున్నారు. ర‌ఘురామా ఛాలెంజ్‌తో వైసీపీకి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. అదేంటి.. అత‌నికి అంత ధైర్యం ఏంటి? జ‌గ‌న్‌కే స‌వాల్ చేసేంత ద‌మ్ము ఎలా వ‌చ్చింది? రాజీనామా చేస్తే న‌ర్సాపురంలో ఉప ఎన్నిక ప‌క్కా. మ‌రి, బై పోల్‌లో గెలుద్దామ‌నే.. ర‌ఘురామ ఇంత దూకుడుగా వెళ్తున్నారా? గెలుపుపై ఆయ‌న‌లో అంత ధీమా ఎక్క‌డిది? ఇదే ఇప్పుడు ఏపీలోనూ, వైసీపీలోనూ హాట్ టాపిక్‌.

అయినా, ర‌ఘురామ కాన్ఫిడెన్స్‌కు కార‌ణ‌మేంటో సామాన్యుల‌కు అంతుచిక్క‌డం లేదు. జ‌గ‌న్ పాల‌న‌కు రెఫ‌రెండం అంటున్నారు ర‌ఘురామ‌. జ‌గ‌న్‌పై ర‌గ‌లిపోతున్న ప్ర‌జావ్య‌తిరేక‌తే త‌న‌కు అనుకూలంగా మారుతుంద‌ని చెబుతున్నారు. అందుకే, జ‌గ‌న్‌తో, ఆయ‌న పార్టీతో నేరుగా న‌ర్సాపురంలోనే తేల్చుకునేందుకు సై అంటున్నారు.

ర‌ఘురామ ఏమీ అలా ఊరికే స‌వాల్ చేయ‌డం లేదు. ఆయ‌న లెక్క‌లు ఆయ‌న‌కున్నాయి. త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేసినా.. తానే రాజీనామా చేసినా.. న‌ర్సాపురంకు బై ఎల‌క్ష‌న్ రావ‌డం ఖాయం. ర‌ఘురామ పోటీ చేయ‌డ‌మూ అంతే కామ‌న్‌. ఏ పార్టీ నుంచి అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్‌. అంద‌రూ అంటున్న‌ట్టు.. బీజేపీ నుంచి బ‌రిలో నిలుస్తారా?  లేక‌, ఇండిపెండెంట్‌గానే జ‌గ‌న్‌ను ఢీ కొడ‌తారా? అనేది ఆస‌క్తిక‌రం.

ర‌ఘురామ బీజేపీ నుంచి పోటీ చేస్తే.. ఎలాగూ జ‌న‌సేనతో ఆ పార్టీకి అల‌యెన్స్ ఉంది కాబ‌ట్టి.. మాంచి ఊపు వ‌చ్చే ఛాన్సెస్ ఎక్కువ‌. ఇక జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు టీడీపీ సైతం పోటీ నుంచి త‌ప్పుకుని ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు. ఇలా, ర‌ఘురామ‌, బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ.. అంతా క‌లిసి జ‌గ‌న్‌పై, వైసీపీపై దండెత్త‌డానికి న‌ర్సాపురం ఉప ఎన్నిక ఓ మంచి అవ‌కాశంగా మార‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. తెలంగాణ‌లో హుజురాబాద్ ఎల‌క్ష‌న్ మాదిరి.. పార్టీల‌తో ప‌ని లేకుండా.. అధికార పార్టీకి గ‌ట్టి బుద్ధి చెప్పేందుకు అంతా ర‌ఘురామ‌కు జై కొట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటున్నారు.

ఇక‌, తాను 3 ల‌క్ష‌ల మెజార్టీతో గెలుస్తాన‌నేది ర‌ఘురామ లెక్క‌. అయ్య బాబోయ్ అంత భారీ మెజార్టీనా అనేది ఓ డౌట్‌. ర‌ఘురామ గాలిమాట‌లేమీ చెప్ప‌రుగా. ఇప్ప‌టికే న‌ర్సాపురం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న స‌ర్వేలు తాను చేయించుకున్నారు. ర‌ఘురామ రాజీనామా అన‌గానే.. వైసీపీ సైతం ఉలిక్కిప‌డి లోక‌ల్ ప‌ల్స్ గురించి ఆరా తీసింది. వైసీపీకి కాస్త షాకింగ్ ఫ‌లితమే రానుంద‌ని తేలింది. మ‌రోవైపు, ప‌లు స‌ర్వే సంస్థ‌లు సైతం న‌ర్సాపురంకు ఉప ఎన్నిక వ‌స్తే ఓటింగ్ స‌ర‌ళి ఎలా ఉండ‌నుంద‌ని స‌ర్వేలు చేప‌ట్టాయి. ఇలా, ఇప్పుడు నియోజ‌క వ‌ర్గంలో స‌ర్వేల సంద‌డి న‌డుస్తోంది.

తాజా సర్వే రిపోర్టుల ప్రకారం నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో వైసీపీకి 36.35 శాతం ఓటర్ల మద్దతుండగా, టీడీపీకి 36.80 శాతం మద్దతిస్తున్నారు. జనసేనకు 23.90 శాతం ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. ఓ ప్రైవేటు సంస్థ ద్వారా నిర్వహించిన ఈ సర్వే గత నవంబర్-డిసెంబర్ మధ్య జరిగింది. ఈ లెక్కన టీడీపీ, వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా ఉన్నట్టు కనిపిస్తున్నా అంతిమ ఫలితాన్ని ఎవరైనా ఇట్టే ఊహించుకోవచ్చు. ఎందుకంటే జనసేన, టీడీపీ ఈసారి కలిసిపోతున్నాయి. అలాగే బీజేపీ కూడా జనసేనకు మద్దతిస్తున్న విషయం గమనించాలి. ఈ క్రమంలో 2019లో నర్సాపురం లో వివిధ పార్టీలు పంచుకున్న ఓట్లెన్నో ఇప్పుడు చూద్దాం. 

అప్పుడు వైసీపీ తరఫున పోటీచేసిన ప్రస్తుత ఎంపీ రఘురామ కృష్ణరాజుకు 4 లక్షల 49వేల 234 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి బరిలో నిలిచిన వి.వి. శివరామరాజుకు 4 లక్షల 16 వేల 518 ఓట్లు వచ్చాయి. జనసేన నుంచి పోటీ చేసిన నాగబాబుకు 2 లక్షల 50 వేల 802 ఓట్లు రావడం గమనించాలి. ఇక బీజేపీ తరఫున పోటీ చేసిన మాణిక్యాలరావుకు 12 వేల పైచిలుకు ఓట్లొచ్చాయి. ఈ పరిస్థితుల్లో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ తొడగొడుతున్న రఘురామకు అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కడుతున్న క్రమంలో తనకు 3 లక్షల మెజారిటీ వస్తుందని రఘురామ నొక్కి చెప్పడంలో పెద్ద వింతగానీ, విశేషం గానీ ఏమీ లేదన్న ఇట్టే తేలిపోతోంది. జగన్ సర్కారు వైఫల్యాలు, ఉద్యోగ సంఘాల్లో వ్యతిరేకత ఇలాంటివన్నీ ఈ మధ్య యాడ్ అయిన అదనపు మైనస్ పాయింట్లుగా కళ్లకు కడుతున్న వాస్తవాలు. సో... రఘురామ లెక్కలు సరైనవేనన్న విషయం అటు జగన్ అండ్ టీమ్ కు బోధపడే ఉంటుందన్నమాట.