బోలేడు సమస్యలున్నా పోరాటమేది? టీటీడీపీ ఉన్నట్టా.. లేనట్టా?

తెలంగాణలో ప్రస్తుతం అన్ని సమస్యలే. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు... ఇలా అన్ని వర్గాల వారు కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాలన్ని దూకుడు పెంచాయి. కేసీఆర్ టార్గెట్ చేస్తూ వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాలు తిరిగి వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కాంగ్రెస్ కూడా నిరుద్యోగుల విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమించింది. వరి అంశంపై జోరుగా జనంలోకి వెళుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఉద్యమాలు చేస్తూ కాంగ్రెస్ కేడర్ లో జోష్ నింపుతున్నారు. వామపక్షాలు కూడా తమకు పట్టున్న ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై పోరాడుతున్నాయి. 

తెలంగాణలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండగా.. మరో విపక్ష పార్టీ అయిన తెలుగు దేశం పార్టీ మాత్రం కనిపించడం లేదు. రాష్ట్రంలో బోలెడు సమస్యలు ఉన్నా ఎక్కడా తెలంగాణ తమ్ముళ్లు స్పందించడం లేదు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ఉందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎల్ రమణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తరుచూ సమస్యలపై స్పందించేవారు. కొన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ సర్కార్ ను నిలదీసేవారు. ఎల్ రమణ టీడీపీని వీడి కారెక్కడంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడింది. ఆ ప్రభావం ప్రస్తుతం కనిపిస్తుందని అంటున్నారు.

ఎల్ రమణ పార్టీ నుంచి వెళ్లిన తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, దళిత నేత బక్కని నర్సింహులును అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. కొత్త కమిటిని కూడా వేశారు. అయితే బక్కని టీమ్ అనుకున్నతంగా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు ఉన్నా... టీటీడీపీ ఒక్క పెద్ద కార్యక్రమం నిర్వహించలేదంటే.. ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. హైదరాబాద్ లోనూ చిన్నపాటి నిరసన కార్యక్రమాలు నిర్వహించలేకపోతోంది. గ్రేటర్ పరిధిలో బలమైన నాయకుడు లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు.

తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నేతలు పార్టీలు మారిన కార్యకర్తలు మాత్రమే అలానే ఉన్నారు. అయితే నడిపించే నాయకుడు లేకపోవడం వల్లే తమ్ముళ్లు రోడ్లపైకి రాలేకపోతున్నారనే అభిప్రాయ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఫైర్ బ్రాండ్ లీడర్లు వస్తే టీడీపీ కేడర్ సత్తా చూపిస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి నేతలు లేకపోవడంతో బయటికి రాలేకపోతున్నారని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోటీ చేసే అభ్యర్థులు కూడా టీడీపీకి దొరకకపోవచ్చని అంటున్నారు.