కాంగ్రెస్ కు తృణమూల్ మరో ఝలక్ .. రాహుల్ టార్గెట్ గా పీకే స్కెచ్

జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి పడగొట్టి ఆ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? కమలదళం కలలుకన్న కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్య సాధనకు, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నడుం బిగించారా? అంటే  రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. 

పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  కాంగ్రెస్ పార్టీలో చేరి, స్వయంగా తానే రాజకీయ చక్రం తిప్పాలని ఆశించారు. అందుకోసం  ప్రయత్నించారు. అయితే, ఎందుకనో  ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఇక అక్కడి నుంచి ఆయన మళ్ళీ మరోసారి మమతతో జట్టు కట్టి, కాంగ్రెస్ మీద కక్షకట్టారా అన్నట్లుగా, రాష్ట్రాలవారీగా, కాంగ్రెస్ జెండాను పీకేసీ ఆ స్థానంలో తృణమూల్ జెండాను ఎగరేసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముందుగా ఈశాన్య రాష్ట్ర్లపై కన్నేసిన పీకే, కొంత వరకు సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొందరు కాంగ్రెస్ ను వదిలి తృణమూల్ గూటికి చేరుతున్నారు.  ఇప్పటికే మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సుష్మితా దేవ్, గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్‌హో ఫ‌లేరో, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఇంకా ఇతర కీలక నేతలు కాంగ్రెస్ ను వదిలి తృణమూల్ తీర్ధం పుచ్చుకున్నారు. 

అంతేకాదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆవిష్కరించే ఆలోచనకు అంకురార్పణ అన్నట్లుగా మేఘాలయలో ప్రతిపక్షపీఠం నుంచి కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి, ఆ స్థానాన్ని తృణమూల్ ఆక్రమించుకుంది. గమ్మత్తు ఏమంటే, రెండేళ్ళ క్రితం జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీనే చేయలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలలో 12 మందిని తమ వైపుకు తిప్పుకున్న తృణమూల్, వృద్ధ కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాను సొంత చేసుకుంది.మమతా బెనర్జీ ఉత్తర ప్రదేశ్, మేఘాలయ, గోవా, త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో తృణమూల్ జెండాని ఇప్పటికే నిలబెట్టారు. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యన్మాయంగా తృణమూల్ సారధ్యంలో మమతా బెనర్జీ నాయకత్వంలో కూటమిని ఏర్పటు చేసేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ముందుగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధనే భావన తుడిచేసేందుకు, ఆయన కాంగ్రెస్ పార్టీని నైతికంగా బలహీన పరిచే వ్యూహంతో అడుగులు వేస్తున్నారని అంటున్నారు. 

ఇదే క్రమమలో తృణమూల్ కాంగ్రెస్ తాజాగా వృద్ధ కాంగ్రెస్ కు మరో ఝలక్ ఇచ్చింది. పార్లమెంట్’లోనూ కాంగ్రెస్ తో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేసింది. సోమవారం (నవంబర్ 29) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఏర్పాటు చేసిన సమావేశానికి తృణమూల్ హాజరు కాదని ఆ పార్టీ నాయకులు  స్పష్టం చేశారు. విపక్షాల సమావేశానికి రావాలని  రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తృణమూల్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. అయితే కాంగ్రెస్ సారధ్యంలో జరిగే విపక్షాల సమావేశానికి తమ పార్టీ హాజరవటం లేదని టీఎంసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.అంతే కాదు, కాంగ్రెస్ పార్టీని తృణమూల్ నేత అవహేళన చేశారు.కాంగ్రెస్ పార్టీలోనే సరైన సయోధ్యత లేదని,ఆ పార్టీ నేతల్లోనే సరైన అవగాహన, లక్ష్యం లేదని ఎద్దేవా చేశారు .

మరో వంక కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విపక్ష్ల పార్టీల ఉమ్మడి సమావేశం జరుగతున్న సమయంలోనే,  మమతా బెనర్జీ ఢిల్లీ నివాసంలో జాతీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా ఇతర కీలక అంశాలపై చర్చించనున్నామని తెలిపారు. కాగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ అదిపత్య పోరు, చివరకు బీజేపీకి మేలు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని, అలాగే, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు మమతా బెనర్జీ సాగిస్తున్న ప్రయత్నం ఫలిస్తే, కాంగ్రెస్ కనుమరుగైపోయినా పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.