టాప్ న్యూస్ @ 8PM

పోలవరం ప్రాజెక్ట్‌లో జరుగుతున్న అవకతవకలపై కేంద్రవిజిలెన్స్ కమిషన్‌కు టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఫిర్యాదు చేసారు. నష్టపరిహారం, పునరావాసంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని లోకేష్  పేర్కొన్నారు. అవకతవకలపై ఆధారాలతో సహా కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసారు. సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు, పాస్‌బుక్ నెంబర్లు, చెల్లించిన డబ్బుల వివరాలను ఫిర్యాదులో లోకేష్ పొందుపరిచారు. సాక్ష్యాల ఆధారంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ వెంటనే విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేసారు. 
--------
విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయానికి కేంద్రం మరో ముందుడుగు వేసింది. లీగల్, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ల నియామకానికి కేంద్రం చకచకా పావులు కదుపుతున్నది. ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కోసం 5 కంపెనీలు బిడ్లు దాఖలు చేసాయి. ఐదుగురిని కేంద్ర ఆర్థిక శాఖ షార్ట్ లిస్ట్ చేసింది. ఈనెల 30న ప్రజెంటేషన్ ఇవ్వాలని 10 కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీచేసింది. లీగల్ లీగల్ అడ్వైజర్ కోసం ఢిల్లీకి చెందిన మూడు కంపెనీలతో పాటు గుర్గామ్, ముంబై కంపెనీలు బిడ్లు దాఖలు చేసాయి. 
----
వైద్యారోగ్యశాఖలో సిబ్బంది నియామకాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష ముగిసింది. వెంటనే సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పీహెచ్‌సీల నుంచి వైద్యకళాశాలలు, బోధనాసుపత్రుల వరకు పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీని ప్రారంభించి నవంబర్‌ 15 నాటికి ముగింపు చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.
-------
ఉత్కంఠ రాజకీయాల మధ్య విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల ఎంపీపీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ-7, వైసీపీ-7 స్థానాల్లో గెలుపొందాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కొర్రా పద్మ టీడీపీలో చేరారు. దీంతో ఎనిమిది మందితో జి.మాడుగుల ఎంపీపీ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. 
-----
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. తీవ్ర అల్పపీడనం ఈ రాత్రికి వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించిందని కన్నబాబు తెలిపారు. రాగల 48 గంటల్లో ఆ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనిస్తుందని వివరించారు
----
నూతన రాష్ట్రంగా తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రోటోకాల్ నియమాల ప్రకారం  అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు. గొప్ప సంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున సూచించిన అంశాలనే కాకుండా ప్రతిపక్షం చర్చించాలనుకున్న సబ్జెక్టులను కూడా పరిగణలోకి తీసుకుని చర్చించాలన్నారు
-------
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామని అన్నారు. ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తామన్నారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని.. అయితే సాగర్ ఉప ఎన్నికలో గెలవడం కష్టమని ఆనాడే చెప్పాన్నారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజం కూడా అంతగా బాగోలేదని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
--------
నల్లగొండ జిల్లాలోని ముషంపల్లిలో అత్యాచారం, హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎంపీ కోమటిరెడ్డి లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేసారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ దుండగులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసారు.
----
విరసం నేత వరవరరావు బెయిల్‌ను బాంబే హైకోర్టు మరోసారి పొడిగించింది. తెలంగాణకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వరవరరావు పిటిషన్ దాఖలు చేశారు. వరవరవరరావు పిటిషన్‌ విచారణను అక్టోబర్ 13కు కోర్టు వాయిదా వేసింది. అక్టోబర్ 13 వరకు ఇదే స్థితిని కొనసాగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. వరవరరావు బాంబేలోనే అక్టోబర్‌ 13 వరకు ఉండాలని కోర్టు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు
------
మరికొన్నిరోజుల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్నాయి. ఓవైపు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. సీనియర్ నటుడు బాబూమోహన్ తాజా 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్లో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బాబూమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరుగా ప్రకాశ్ రాజ్ పేరెత్తకుండా మరో ప్యానెల్ ప్రెసిడెంట్ అంటూ విమర్శించారు.