సామాన్యుల ఖాతాల్లోకి నోట్ల వరద.. ఎందుకిలా..?

వారం రోజుల క్రితం ఒక సామాన్య వ్యక్తి ఖాతాలో 5.5లక్షలు జమయ్యాయి. రెండు రోజుల క్రితం ఇద్దరు స్కూలు పిల్లల ఖాతాల్లో ఏకంగా 960 కోట్లు ఒకేసారి వచ్చి పడ్డాయి. ఆ మిస్టరీ  ఏమిటో తేలక ముందే శుక్రవారం ఓ రైతు ఖాతాలో 52 కోట్లు జమయ్యాయి. ఇలా బిహార్‌లో సాధారణ పౌరుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి. అయితే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో, అంత సొమ్ములు సామాన్యుల ఖాతాల్లో వేస్తున్న, ‘’పుణ్యాత్ములు’ ఎవరో మాత్రం తెలియడం లేదు. కానీ, ప్రతి రోజు ఇక్కడో అక్కడో ఎక్కడో అక్కడ నుంచి ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయితే, ఖాతాల్లో సోమ్ములు, (తెలంగాణలో  దళిత బంధు లబ్దిదారుల ఖాతాల్లో  జమైన రూ. 9,99,000 లాగా) చూసుకోవడానికే కాని, తీసుకోవడానికి లేకుండా బ్యాంకు అధికారాలు, ఆ ఖాతాలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నారు. అయితే ఇందుకు ఒకే ఒక్క మినహా యింపు తమ ఖాతాలలో రూ.5.5 లక్షలు పడిన సామన్యుడు.. అతని ఖాతాలో జమైన సొమ్మును అతను, బ్యాంకు అధికారులు గుర్తించే లోగానే విత్ డ్రా చేసుకుని ఖర్చు చేసుకున్నారు. అంతే కాదు. అవి ప్రధాని మోడీ వేసిన సోమ్ములంటూ వెనక్కి ఇచ్చేది లేదని  బ్యాంకు అధికారులకు షాక్ ఇచ్చారు. 

ఇక తాజా విషయానికి వస్తే, అదే బీహార్ ముజఫరాపూర్‌ జిల్లా కతిహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రామ్‌ బహుదూర్‌ షా పింఛన్‌ ఖాతాకు ఆధార్‌ కార్డు, వేలిముద్ర వెరిఫికేషన్‌ కోసం బ్యాంకుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఖాతాలో ఎంతుందో చెక్‌ చేయాలని అక్కడి కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ (సీఎస్‌పీ) అధికారిని కోరగా.. ఖాతా చెక్‌ చేస్తే అందులో రూ.52 కోట్లు ఉన్నట్లు చూపించింది. అంతమొత్తం ఉండడం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలీదని బహుదూర్‌ షా చెప్పుకొచ్చాడు. అయితే ,ఇదే తరహాలో పెద్ద మొత్తంలో ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న ఉదంతాలు వెలుగుచూసినప్పుడు ఆయా ఖాతాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అలాగే, రామ్‌ బహుదూర్‌ షా ఖాతాను కూడా బ్యాంకు అధికారులు తాత్కాలికంగానిలిపి వేశారు. 

అయితే, పాపం ఆ బక్క రైతు, అత్యాశకు పోకుండా అంతా వద్దులే, తన ఖాతాలో పడిన సొమ్ములో ఎంతో కొంత తనకిస్తే బతికేస్తానని బ్యాంకు అధికారులను అడుగుతున్నాడు. “వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఆ ఖాతాలో కొంత సొమ్ము ఇప్పిస్తే నా జీవితం సాఫీగా సాగిపోతుంది’’ అని ప్రభుత్వానికీ విజ్ఞప్తి చేశాడు. అయితే, అది అయ్యే పని కాదు కానీ, అసలు ఇలా సామాన్యుల ఖాతాలో కోట్ల రూపాయలు వచ్చి పడడం, ఏమిటో .. ఇందులో మాటలను ఏమిటో మాత్రం అంతు చిక్కని వింతగానే ఉంది. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయం;లో సామాన్యుల ఖాతాల్లో పెద్ద మొత్తాలు వేసి ‘పెద్ద’  మనుషులు సాగించిన గోల్ మాల్ వ్యవహారం వంటి వ్యవహారం ఏదైనా ఉందా .. అనే సందేహం కూడా కలుగుతోంది .. అయితే అదేమిటో ..అక్కడి  అధికారులకే తెలియాలి .. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు.