చంద్రబాబు ఇంటిపై దాడి ఘ‌ట‌న‌.. రెండు కేసులు పెట్టిన పోలీసులు...

శుక్ర‌వారం ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటి మీద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడికి దిగారు. రాళ్లు, జెండా క‌ర్ర‌ల‌తో టీడీపీ వ‌ర్గీయుల‌ను గాయ‌ప‌రిచారు. వంద‌లాది మందిని వెంటేసుకొని వ‌చ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేశ్‌.. టీడీపీ అధినేత నివాసం ద‌గ్గ‌ర ర‌చ్చ రంభోలా చేశారు. టీడీపీ విడుద‌ల చేసిన ఫూటేజీలో జోగి ర‌మేశ్ వ‌ర్గం ప‌దుల సంఖ్య‌లో కార్ల‌లో క‌ర్ర‌లు ప‌ట్టుకొచ్చిన దృశ్యాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త‌త‌ను రేపిన చంద్ర‌బాబు ఇంటిపై దాడి ఘ‌ట‌న‌లో పోలీసుల వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ముందురోజే ఎమ్మెల్యే ర‌మేశ్ తాను చంద్ర‌బాబు ఇంటిని చుట్టుముడ‌తాన‌ని చెప్పినా.. ఆయ‌న్ను హౌజ్ అరెస్ట్ చేయ‌క‌పోవ‌డం.. మార్గ‌మ‌ధ్య‌లోనే అడ్డుకోక‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

అంతా ముగిశాక‌.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ద‌గ్గ‌ర‌ చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా.. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.