పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరు?!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసినట్లుగా పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరంటూ బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ తారాచంద్ డోనాల్డ్ ట్రంప్ ను నిలదీశారు. వెనిజులాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా నికోలస్ మదురోను అరెస్టు చేసిన అమెరికా అధ్యక్షుడు  పాక్ ఆర్మీ చీఫ్ విషయంలో ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.

నికోలస్ మదురో వెనిజులా నేచురల్ రిసోర్సస్ ను  చైనాకు అప్పగించి దోపిడీకి సహకరిస్తున్నారంటున్న ట్రంప్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కూడా బలోచిస్థాన్ లోని ఖనిజ సంపద, సముద్ర వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డాక్టర్ తారాచంద్ ప్రశ్నించారు.  పాక్ ఆర్మీ చీఫ్ మునీర్  డబుల్ ఏజెంట్ లా వ్యవహరిస్తూ, ఒకవైపు బలోచ్ వనరులను చైనాకు కట్టబెడుతూనే, మరోవైపు అమెరికాను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. . మదురోపై అమెరికా ఇటీవల  మెరుపు దాడి జరిపి అరెస్టు చేసినట్లుగానే  పాక్ ఆర్మీ చీఫ్‌ను కూడా బంధించాలని ఆయన డిమాండ్ చేశారు. 
వనరుల దోపిడీకి తోడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బలోచిస్థాన్‌లోనూ, సరిహద్దులకు ఆవల కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ తారాచంద్ ఆరోపించారు.  

వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బలోచ్ అమెరికన్ కాంగ్రెస్  బలోచిస్థాన్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు  డాక్టర్ తారా చంద్ గతంలో బలోచిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా  కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ప్రవాసంలో ఉన్నారు.  అక్కడి నుంచే బలోచిస్థాన్ హక్కుల కోసం పోరాటం జరుపుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu