ఒక మరణం.. ఎన్నో సందేహాలు!
posted on May 21, 2024 5:02PM
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం మీద అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కి ప్రమాదం జరిగిందని తెలియగానే, ఇది ఇజ్రాయిల్ పనే అనే అనుమానాలు చాలామందిలో కలిగాయి. గాజా మీద ఇజ్రాయిల్ దాడులు జరిగిన నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య విభేదాలు తలెత్తాయి. రెండు పరస్పరం దాడులు చేసుకునే వరకూ పరిస్థితి వెళ్ళింది. ఇరు దేశాల మధ్య ఏర్పడిన విభేదాలు అంతకంతకూ పెరిగే పరిస్థితులు కనిపించాయి. ఇజ్రాయిల్ విషయంలో తమ దేశానికి మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో శత్రుత్వం వున్న పాకిస్తాన్‌తో కూడా ఇబ్రహీం రైసీ స్నేహం ప్రారంభించారు. మొన్నామధ్యే ఆయనే స్వయంగా పాకిస్తాన్ వెళ్ళారు. అంతర్జాతీయ అంశాల మీద రెండు దేశాలూ కలసి పనిచేస్తాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ రైసీ హత్యకు పథకం పన్ని హెలికాప్టర్ని కూల్చి వుండొచ్చన్న అనుమానాలు తలెత్తాయి. అయితే ఇజ్రాయిల్ వెంటనే స్పందించింది. హెలికాప్టర్ ప్రమాదం విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదని ప్రకటించింది. అయినప్పటికీ ఇజ్రాయిల్ మీద అనుమానాలు పోలేదు.
హెలికాప్టర్ ప్రమాదం విషయంలో తమకేమీ ప్రమేయం లేదని ప్రకటించిన ఇజ్రాయిల్ అక్కడతో ఆగలేదు. ఈ ప్రమాదానికి కారణం అమెరికా అని, అమెరికా వల్లే రైసీ చనిపోయారని బాంబు పేల్చింది. హెలికాప్టర్ విడిభాగాల సరఫరా విషయంలో అమెరికా కొన్ని దేశాల మీద ఆంక్షలు విధించింది. ఆ దేశాల్లో ఇరాన్ కూడా వుంది. హెలికాప్టర్ విడిభాగాల దిగుమతికి అవకాశం లేకపోవడంతో ఇరాన్ స్థానికంగా తయారుచేసుకున్న, అంతగా నాణ్యత లేని విడిభాగాలనే ఉపయోగించాల్సి వస్తోంది. దీనివల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగింది అంటూ ఇజ్రాయిల్ ఈ ప్రమాదాన్ని అమెరికా అకౌంట్లో వేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఇబ్రహీం రైసీ మరణం విషయంలో మరో కొత్త కోణం బయటకి వచ్చింది. ఇరాక్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా అంతరిక్ష లేజర్ ఆయుధాన్ని ఉపయోగించి రైసీ హెలికాప్టర్ని కూల్చివేయించి వుంటాడని వదంతులు వినిపిస్తున్నాయి. అలీ ఖమేనీ వయసు ప్రస్తుతం 85 సంవత్సరాలు. ఆయన తదనంతరం ఇరాన్ సుప్రీమ్‌గా ఇబ్రహీం రైసీ అయ్యే అవకాశం వుందని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి తర్వాత ఇరాన్ సుప్రీం పీఠాన్ని ఎక్కాలని కోరుకుంటున్న ముజ్తబా, తనకు పోటీగా వున్న ఇబ్రహీం రైసీని అంతం చేసి వుండవచ్చని వదంతులు వినిపిస్తున్నాయి.