స్వచ్ఛందంగా తెల్లకార్డులు తిరిగి ఇచ్చేస్తారా?

 బోగస్‌ తెల్లకార్డులున్న వారందరూ స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని రాష్ట్రపౌరసరఫరాలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు కోరారు. ఆగస్టు పదోతేదీలోపు ఈ కార్డులు అందజేయాలని ఆయన గడువు ఇచ్చారు. తెలిసో తెలియకో కార్డులుంటే అప్పజెప్పేయాలి అని మంత్రి పేర్కొనటాన్ని రాష్ట్రంలోని పలువురు ఎగతాళి చేస్తున్నారు. ఇదేమిటి అలా అడిగేస్తే ఇచ్చేస్తారా అని  ప్రశ్నిస్తున్నారు. కొందరు ధనవంతులు కూడా  వీఆర్వోలను మెప్పించి మరీ ఈ కార్డులను పొందారు. అలానే ఆరోగ్య అవసరాలు తీర్చుకునేందుకు ధనవంతులు ఎక్కువ మంది తెల్లకార్డులు పొందారు.



రెవెన్యూ శాఖలోని సిబ్బందికి తెలియకుండా ఈ కార్డులు విడుదలవ్వలేదు కాబట్టి వారిని హెచ్చరిస్తే బాగుంటుంది కానీ, బోగస్‌కార్డుదారులనే స్వచ్ఛందంగా అప్పగించమనటం ఎంతవరకూ కరెక్టు అని ప్రశ్నిస్తున్నారు. అలాకార్డులు అప్పగించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ఏ చర్య తీసుకోవటానికి అవకాశముందో ముందుగానే చూసుకుని చెప్పాల్సిన మంత్రి ఇలా కామన్‌గా ప్రకటిస్తే బోగస్‌కార్డుదారులు బయటపడతారా? అసలు లొసుగున్న రెవెన్యూశాఖను హెచ్చరిస్తే ఈ కార్డులు ఎక్కడ ఉన్నాయో వివరాలన్న దొరికేవి.



ఇటీవల ప్రతీరేషను దుకాణంలోనూ తెల్లకార్డుదారుల ప్రూఫ్‌లు తీసుకున్నారు. అలా ప్రూఫ్‌లు సమర్పించకుండా కార్డులను కొనసాగించేవారిపై చర్య తీసుకుంటామని ప్రకటిస్తే బోగస్‌కార్డుల వివరాలు సేకరించటం ఏమంత కష్టం కాబోదు. ఈ విషయాన్ని మంత్రి గుర్తించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛందంగా కార్డులు సమర్పించకుంటే వాటిని రద్దు చేస్తామన్నా బాగుండేదని మంత్రికి పలువురు సూచిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu