టిఆర్‌ఎస్ కు మంత్రిపదవుల ఎర?
posted on Jul 28, 2012 12:33PM
కేంద్రక్యాబినెట్‌లో రెండు మంత్రిపదవులు తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్)కు కేటాయించాలని సోనియా యోచిస్తున్నట్లు తెలిసింది. టి.ఆర్.ఎస్.ను బుట్టలో వేసుకునేందుకే ఇటువంటి ఆఫర్ ఆ పార్టీకి ఇస్తున్నట్లు తెలిసింది అయితే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఉండబోదని ప్రకటించేందుకు కేంద్రం సన్నద్ధమవటంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేరేందుకు సముఖత వ్యక్తం చేయకపోవచ్చని రాజకీయపరిశీలకులు తేల్చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ముందుగా సమాచారాన్ని లీక్ చేసినా ఇంతవరకూ తన వైఖరిని ప్రకటించని టిఆర్‌ఎస్ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా లేదంటే ఊరుకోదని జగమెరిగిన సత్యం.
అసలు ప్రత్యేకతెలంగాణా అంశమే లేకుంటే టిఆర్‌ఎస్ లేదు. అందువల్ల పార్టీ దెబ్బతింటుందని ఆ పదవులను త్యాగం చేసేందుకు సిద్ధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ మీడియాకు దూరంగా ఉంటున్న టిఆర్‌ఎస్ అధినేత కెసీఆర్ ఇక తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం త్వరలో తెలంగాణా ప్రకటించేస్తుందని ఆశలు పెట్టుకున్న ఆయన ఆందోళనలు సైతం చేయొద్దని ప్రకటించారు. కేంద్రం నిర్ణయం మారుతున్నందువల్ల అందువల్ల ఆయన తిరిగి ఉద్యమబాట పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా కేంద్రహోంశాఖ రాష్ట్రపతికి ఇచ్చే నివేదిక టిఆర్‌ఎస్‌తో తెగతెంపుల దాకా రావచ్చనేది పరిశీలకుల అభిప్రాయం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెరపైనే చూడాలి!