మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు కేసుకు, కేసీఆర్‌కు ఉన్న లింక్ యేంటి?

రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుడిగా చేర్చారు.  బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో కాజోల్ రెండు నెలల కొడుకు రన్వీర్ మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. మార్చి 17 2022 లో రోడ్ నెంబర్ 45లో ప్రమాదం చోటుచేసుకుంది.   ఆ కారు ప్రమాదంలో డ్రైవ్ చేసిన వ్యక్తిని కాకుండా మరొకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్ షీట్ వేయడంతో ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. కారుపై MLA షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అది తన కారు కాదని MLA స్టిక్కర్ ను తన స్నేహితుడికి ఇచ్చినట్లు అప్పట్టి ఎమ్మెల్యే షకీల్ వాదించాడు.  పోలీసులు షకీల్ కుమారుడి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ కోసం చూడగా లభ్యం కాని పరిస్థితి. కారు ఎవరు నడిపారు అన్నదానిపై గతంలో స్పష్టత లభించలేదు. అయితే కారు తానే నడిపాను అంటూ ఆఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. అకస్మాత్తుగా కాజోల్ రోడ్డు మీదకు రావడంతో కారు ఢీకొట్టిందని, భయంతో కారులో ఉన్న ముగ్గురం పారిపోయినట్లు ఆఫ్నాన్ వాంగ్మూలం ఇచ్చాడు.   దాంతో కేసులో ఆఫ్నాన్‌ను నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఛార్జ్‌షీట్‌ను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు దాఖలు చేశారు. 
అయితే తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు కాజోల్ వాంగ్మూలంతో పాటు లొంగిపోయిన ఆఫ్నాన్ వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. కారు నడిపింది షకీల్ కొడుకు సోహైల్ అంటూ వారు చెప్పడంతో 304 పార్ట్ 2గా సెక్షన్లు మార్చారు. ఈ క్రమంలో కేసును మరోసారి జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. మరో సారి ఈ కేసుపై దృష్టి పెట్టిన పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. 

పోలీసులు మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ గ‌త చ‌రిత్ర‌ను కూడా త‌వ్వితీస్తున్నారు. అప్పట్లో మహ్మద్‌ షకీల్‌ ఆమీర్‌ అలియాస్‌ బోధన్‌ షకీల్‌ మోస్ట్‌ వాంటెడ్ గా ఉండి పోలీసుల‌కు ప‌రుగులు పెట్టించాడ‌ట‌.  
మీకు గుర్తుందా? అప్ప‌ట్లో మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్‌పోర్ట్స్‌ స్కామ్‌ 2007లో వెలుగులోకి వచ్చింది. అమెరికా సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళను అక్రమంగా దేశం దాటించడానికి దేశ వ్యాప్తంగా ముఠాలు ఏర్పడ్డాయి. వీరు కొందరు ప్రజాప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని గుజరాతీయులను వాళ్ళ కుటుంబీకులుగా మార్చారు. ఆయా ప్రతినిధుల సిఫారసుల ఆధారంగా మారు పేర్లతో గుజరాతీయులకు పాస్‌పోర్టులు అందించారు. సుదీర్ఘకాలం జరిగిన ఈ స్కామ్‌లో ఢిల్లీలో ఎంపీ బాబూ భాయ్‌ కటారా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. స‌మైక్య రాష్ట్రంలో వున్న ఎంపీలు కూడా ఈ స్కామ్‌లో వున్నార‌నే ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో వ‌చ్చాయి. అయితే హైద‌రాబాద్ నగరంలో నమోదైన కేసులో బోధన్‌ షకీల్‌ నిందితుడు. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో షకీల్‌ కోసం హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు ముమ్మరంగా గాలించి పట్టుకున్నారు. బోధ‌న్ ష‌కీల్‌కు కేసీఆర్‌తో చాలా మంచి సంబంధాలుండేవి.  ఆ త‌రువాత ఆయ‌న్ని అప్ప‌ట్టి టీ ఆర్ ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అప్పుడు ష‌కీల్‌, ఇప్పుడు అత‌ని కొడుకు సాహిల్ ఇద్ద‌ర్ని కేసీఆర్ కాపాడుకున్నా కాజోల్ చౌహాన్ కేసు ఇప్ప‌ట్టికీ ష‌కీల్‌ను వెంటాడుతూనే వుంది. 
రేవంత్‌రెడ్డి సి.ఎం.గా అయినా త‌రువాత ఏ విష‌యాన్ని వ‌ద‌ల‌డం లేదు. చాలా లోతైన ప‌రిశోధ‌న చేయిస్తున్నారు. ష‌కీల్ గ‌త చ‌రిత్ర‌, కేసీఆర్‌తో క‌లిసి ఆయ‌న చేసిన వ్యాపారాలు, విదేశాల‌కు మ‌నుషుల్ని పంపిన ముఠాలో రాజ‌కీయ నాయ‌కుల పాత్ర త‌దిత‌ర అంశాల‌పై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసులోనూ సి.ఎం. రేవంత్ టార్గెట్ కేసీఆర్ యేన‌ని గాంధీభ‌వ‌న్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.