స్లీపింగ్ డైవొర్స్.. ఇదో కొత్త విడాకుల పోకడ.. భార్యాభర్తలకు దీంతో ఎంత లాస్ అంటే...

మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయ్యాయని ఒకప్పుడు చెప్పుకునేవాళ్లం. అది ఇప్పటికీ ఉంది కానీ.. మానవ సంబంధాలు మరికొన్ని కొత్త రూపాలకు దారి మళ్లాయి. ఒకప్పుడు వైవాహిక జీవితంలో ఏ సమస్య వచ్చినా  దాన్ని పరిష్కరించుకోవడం, సర్థుకోవడం చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు.. ఏ సమస్య వచ్చినా దాన్ని తెగెవరకు లాగి అదే సమస్యకు పరిష్కారం అని అనుకుంటున్నారు. ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్న విషయం స్లీపింగ్ డైవొర్స్.. అసలు స్లీపింగ్ డైవొర్స్ అంటే ఏంటి? దీనివల్ల భార్యాభర్తలకు జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే..


పెళ్లైన భార్యాభర్తలు  ఒకే గదిలో ఉన్నప్పుడు వారు కలిసి నిద్రపోతారు.  ఇద్దరూ విడివిడిగా పడుకోవడం ప్రారంభిస్తే వారి మధ్య ఏదో సరిగ్గా జరగడం లేదనే అనుమానం వస్తుంది.  సాధారణంగా భార్యాభర్తలు ఇక ఇద్దరూ కలిసి జీవించలేమని నిర్ణయించుకున్న తరువాత విడాకులు తీసుకుంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ అనేవి బంధాన్ని తెంచుకునే విడాకులు కాదు.. నాణ్యమైన నిద్ర పొందడానికి భాగస్వాములు విడివిడిగా నిద్రపోవడానికి తీసుకునే విడాకులు. సాధారణంగా భాగస్వాములు నిద్రలో చేతులు,  కాళ్లను కదిలించడం వల్ల, గురకకు అలవాటు పడడం వల్ల లేదా ఏదైనా నిద్ర రుగ్మత కారణంగా పక్కవారి నిద్రకు డిస్టర్బ్ కలిగిస్తూ ఉంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ కారణంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇద్దరు హాయిగా నిద్రపోతారని  అనుకుంటున్నారు. కానీ  ఇది సమస్యను పరిష్కరించడానికి బదులుగా వారి మధ్య బంధాన్నిబలహీనపరుస్తుంది.


నిద్ర కోసం ఈ స్లీపింగ్ డైవొర్స్ తీసుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అయినా సరే ఈ డైవొర్స్ స్లీపింగ్ వల్ల జంట మధ్య బంధం బలహీనపడుతుందని రిలేషన్షిప్ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా వారిని ఎప్పటికీ కలిపి ఉంచేది వారిద్దరి మధ్య శారీరక స్పర్శే.. అది కూడా వారిమధ్య లేనప్పుడు  ఇక ఇద్దరినీ కలిపి ఉంచే మార్గమేదీ ఉండదు. ఒకే ఇంట్లో ఇద్దరూ అపరిచితుల్లా చాలా  కొద్ది కాలంలోనే మారిపోతారు. మరొక విషయం ఏమిటంటే ఇలా ఇద్దరూ విడివిడిగా పడుకోవడం అనేది దీర్ఘకాలం జరిగితే వైవాహిక బంధాలు విచ్చిన్నమై వాటి విలువ కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన నిద్రకోసం భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యకరమైన పద్దతులు ఎంచుకోవాలి. వైద్యుల సలహా తీసుకుని నిద్రకు బంగం కలిగించే సమస్యలను పరిష్కించుకోవాలి.


                                             *రూపశ్రీ.