కాంగ్రెస్ గెలుస్తుంది.. నేనే సిఎం.. రేవంత్ ధీమా ఏంటి?

ఆలు లేదు చూలులు లేదు కొడుకు పేరు సోమ లింగం, అన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ అప్పుడే మొదలైంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ముందుగా ముఖ్యమంత్రిని ప్రకటించే సంస్కృతి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, ఎఐసీసీ పరిశీలకుల సమక్షంలో సీఎల్పీ  సమావేశం నిర్వహించడం, ముఖ్యమంత్రి ఎంపిక  బాధ్యతను పార్టీ అధిష్టానికి వదిలేస్తూ తీర్మానం చేయడం అక్కడి నుంచి వచ్చిన పరిశీలకులు సీల్డ్ కవర్ విప్పి ముఖ్యమంత్రి పేరు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే  ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో  చాలా మార్పులే వచ్చినట్లు కనిపిస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియలోనూ ఏదైనా మార్పు వచ్చిందా? వస్తోందా? అన్నది చూడవలసి వుంది. 

అయితే, అధిష్టానం నిర్ణయం ఎదైనప్పటికీ పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు  అయన ముఖ్యమంత్రి అయిపోయినట్లు ఉహించుకుంటున్నారు. నిజంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపు పై భరోసాతో ఉన్నారో లేదో కానీ  కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ తనదేనని గట్టిగా నమ్ముతున్నారు. ‘నేనే ముఖ్యమంత్రి’ అని స్వయంగా ప్రకటించుకుంటున్నారని కూడా అంటున్నారు.

నిజమే తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల నుంచీ కూడా రేవంత్ రెడ్డ లో ముఖ్యమంత్రి కావాలనే కోరిక బలంగా ఉందనేది బహిరంగ రహస్యం. టీడీపీలో ఉన్న  రోజుల్లోనే రేవంత్ రెడ్డి, విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తే  తెరాసలో చేరేందుకు కూడా సిద్ధమని  ప్రకటించారు.ఇప్పడు మళ్ళీ అదే తీరున విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ తన మసులోని మాటను మరోమారు బయట పెట్టుకున్నారు. రాజకీయ అరంగేట్రం నుంచి తాను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతోందని, ఇప్పడు కూడా అదే (తాను ముఖ్యమంత్రి కావడం) జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని  పీసీసీ అధ్యక్ష పదవి సంపాదించానని చెప్పు కొచ్చారు. అయితే  ఇప్పుడు రేవంత్ రెడ్డి ‘పిచ్చాపాటి’చర్చకు తెర  తీయడం వెనక రేవంత్ రెడ్డి వ్యూహం భరోసా ఏమిటనే చర్చ పార్టీ నేతల మధ్య మొదలైందని అంటున్నారు. 

రేవంత్ రెడ్డి పాదయాత్రకు వస్తున్న అద్భుత స్పందన చూసి రేవంత్ లో ధైర్యం వస్తోందని అందుకే  ఆయన తన మనసులోని కోరికను బయట పెట్టడం ద్వారా సీనియర్ల స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చమొదలైంది. నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షడు అయిన తర్వాత  పార్టీలో, పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో ఒక ఊపు వచ్చింది.  బీఆర్ఎస్ కు పోటీగా జనసమీకరణ చేయడంలో రేవంత్ వర్గం సక్సెస్ అయ్యింది. ఇప్పడు పాద యాత్రలోనూ అదే  జోరు కనిపిస్తోంది.  అధిష్టానం అనుమతితోనే నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి భట్టి విక్రమార్క పాద యాత్రలు  చేపట్టినా  జనం నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో రేవంత్ రెడ్డిలో ధీమా పెరిగిందదనీ అందుకే  ఇంతవరకు మనసులో దాచుకున్న కోరికను  బయట పెట్టారని అంటున్నారు.

నిజానికి, కాంగ్రెస్ సీనియర్లు పార్టీని వదిలి పోవాలనే కోరిక రేవంత్ రెడ్డి  ఆయన వర్గంలో మొదటి నుంచి వుందని కోమటి రెడ్డి వెంకట రెడ్డిని రేవంత్ వర్గానికి చెందిన అద్దంకి దయాకర్  బహిరంగ వేదిక నుంచి  ఉంటే పార్టీలో ఉండు లేదంటే అనే స్థాయిలో విరుచుకు పడ్డారని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు ఇంకా అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి ఆయన వర్గం సీనియర్లను పొమ్మన కుండా పొగ బెట్టి సాగనంపే ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. అందుకే తనకు తానే సీఎంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని అంటున్నారు.  

అందుకే మళ్లీ కొడంగల్ నుంచి పోటీచేయడానికి రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. రెండు సార్లు అక్కడి నుంచి గెలిచినా గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఏ పార్టీకీ ఆంధ్ర తెలంగాణలో మూడు సార్లు అధికారం ప్రజలు ఇవ్వలేదని.. ఈ సారి కాంగ్రెస్ గెలుస్తుందని.. తానే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి నమ్మకంగా ఉన్నారు. మరి రేవంత్ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాల్సి ఉంది.