ఏంటీ ఆపరేషన్ నుమ్ ఖోర్?
posted on Sep 25, 2025 3:42PM

భూటాన్ భాషలో నుమ్ ఖోర్ అంటే వెహికల్. అచ్చ తెలుగులో చెప్పాలంటే వాహనం అని అర్ధం. మన దేశంలోకి విదేశీ వాహనాల దిగుమతిపై నిషేధం ఉండటంతో, ఈ వాహనాలను మొదట భూటాన్ కి తరలించి.. ఆపై వాటిని సెకెండ్ హ్యాండ్ పేరిట భారత్ లోకి తెస్తుంటారన్నమాట. ఇలాంటి వాహనాలు భారత్ లో సుమారు 120 వరకూ ఉన్నట్టు గుర్తించారు. అందునా కేరళలో ఇవి 30కి పైగా ఉన్నట్టు కనుగొన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఒక నిషేధిత లగ్జరీ కార్లో తిరుగుతున్నట్టు గుర్తించారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, పృధ్వీరాజ్ సుకుమారన్ వంటి సినీ నటుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు అధికారులు. వీరితో పాటు మరికొందరు పారిశ్రామికవేత్తలు, ఇతర సంపన్నుల దగ్గర కూడా ఈ లగ్జరీ కార్లున్నట్టు గుర్తించారు అధికారులు. తిరువనంతపురం, కొజికోడ్, మలప్పురం, కుట్టిపురం, త్రిసూర్ వంటి ప్రాంతాల్లో.. సోదాలు నిర్వహించిన అధికారులు.. ఎవరెవరి దగ్గర ఎన్నేసి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిని ఎక్కడి నుంచి తరలించారు? ఆ వివరాలేంటన్న ఆరా తీస్తూ సోదాలు నిర్వహించారు.
దుల్కర్ సల్మాన్ నుంచి 2 కార్లు, అమిత్ చలక్కల్ నుంచి 8 కార్లతో సహా మొత్తం 36 కార్లు స్వాధీనం చేస్కున్నారు. ఈ లగ్జరీ కార్లకు విన్ అనే ఒక డిఫరెంట్ కోడ్ ఉంటుంది. దీనిలో ఆ కారు చాసిస్ నెంబర్ ఉంటుంది. ఈ పదహారు అక్షరాల కోడ్ లో కారు ఎక్కడ తయారైంది? దాని ఇతర డీటైల్స్ ఉంటాయి. వీటి ద్వారా ఈ కార్లను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు.
తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ కోవలోకి వచ్చే ల్యాండ్ క్రూయిజర్ కార్లో తిరుగుతున్నట్టు ఆరోపిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ అక్రమంగా దిగుమతి చేసుకున్న కారు కేటీఆర్ కుటుంబ కంపెనీ పేరిట ఎందుకు రిజిస్టరయ్యిందో చెప్పాలన్నారు బండి సంజయ్. దీని కొనుగోలులో మార్కెట్ ధర చెల్లించారా? లేదంటే తక్కువ ధరకే కొన్నారా? బినామీల పేరిట కొన్నారా? వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు బండి సంజయ్. ఎక్స్ వేదికగా ఈ అంశానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు బండి సంజయ్.
బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఎనిమిది కార్లను స్మగ్లింగ్ చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో ల్యాండ్ క్రూజర్ వాహనాల స్మగ్లర్ బసరత్ ఖాన్ అంగీకరించారు. ఆ వాహనాల నంబర్లనూ అధికారులకు బసరత్ ఖాన్ అందజేశారు. ఆ నంబర్లలో టీజీ00డి 6666 నంబరు గల ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని తన కాన్వాయిలో కేటీఆర్ ఉపయోగిస్తున్నట్లుగా అధికారుల ఎదుట బసరత్‌ఖాన్ చెప్పారు. ఇలా దేశ వ్యాప్తంగా లగ్జరీ కార్ల స్కామ్ కి సంబంధించి ఒకేసారి బయట పడ్డంతో.. ఇపుడీ వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది.