పెరిగిన చలి తీవ్రత...స్కూల్స్ టైమింగ్స్ మార్పు
posted on Dec 18, 2025 8:39PM

తెలంగాణలో చలి తీవ్రత అధికంగా పెరిగింది. అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి ఉదయం వరకు బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరగటంతో జిల్లా కలెక్టర్ స్కూల్స్ టైమింగ్స్ మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు ఉదయం 9 గంటలకు నుంచి సాయంత్రం 4 :15 గంటల వరకు ఉన్న బడి సమయాలను ప్రస్తుతం 09:40 గంటల నుంచి సాయంత్రం 04 :30 గంటలకు మార్చారు. అటు ఇతర జిల్లాల్లోనూ స్కూల్ టైమింగ్ మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
గత మూడు రోజుల నుంచి సాధారణం కంటే 4 డిగ్రీలకు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు అధికారులు. ఆయా జిల్లాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట కనీస జాగ్రత్తలు లేకుండా బయటికి రావొద్దని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు