వారం రోజులుగా హస్తినలోనే లోకేష్.. వ్యూహం ఏమిటి?
posted on Sep 21, 2023 3:44PM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ వారం రోజులుగా హస్తినలోనే మకాం వేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై జాతీయ మీడియాజాతీయ దృష్టి కేంద్రీకరించేలా చేశారు. జాతీయ మీడియా ప్రశ్నలకు సమర్ధంగా బదులిచ్చి జాతీయ స్థాయిలో సమర్థ నేతగా నిరూపించుకున్నారు. బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ జగన్ తో బహిరంగ చర్చకు సై అంటూ సవాల్ విసిరి సంచలనం సృష్టించారు.
అలాగే జాతీయ స్థాయి నేతలతో వరుస భేటీలతో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా అందరి మద్దతూ పొందగలిగారు. అయితే ఇక్కడ ఏపీలో ఆయన లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబు అరెస్టుకు ఖండిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తెలుగుదేశం శ్రేణులు దీక్షలతో, ర్యాలీలతో చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అయినా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యత, పాపులారిటీ ఉన్న నారా లోకేష్ ఈ సమయంలో రాష్ట్రం బయట ఉండటం ఒకింత లోటుగానే కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ. మరి లోకేష్ ఢిల్లీలోనే వారం రోజులుగా ఎందుకు మకాం వేశారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం ఒక్క సారిగా నిస్తేజంగా మారిపోయిందా? ఈ పరిస్థితిని అధిగమించడానికి న్యాయపోరాటం, ప్రజా పోరాటాలు కాకుండా మరో మార్గం ఏమైనా ఉందా? గతంలో 1984 లో అప్పటి ఎన్టీఆర్ సర్కార్ ను అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్య విరుద్ధంగా అప్పటి ఏపీ గవర్నర్ రామ్ లాల్ సహకారంతో గద్దె దింపినప్పుడు.. ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహాన్ని ఒక పద్ధతిలో సమన్వయ పరిచి గొప్ప రాజకీయ ఉద్యమంగా మలచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు సమయంలో ప్రజాగ్రహాన్ని ప్రజాందోళనగా, రాజకీయ ఉద్యమంగా మలచే విషయంలో ఎందుకు వెనకబడుతోంది?
అప్పట్లో ప్రజాందోళనలు కేంద్రం మెడలు వంచేలా పకడ్బందీగా సాగడం వెనుక చంద్రబాబు చాణక్యం ఉంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని రాజకీయ ఉద్యమంగా మలచాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది. హస్తినలో లోకేష్ అదే పనిలో ఉన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. లోకేష్ ఢిల్లీలో పార్టీ అంతర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీయ మీడియా ద్వారా జగన్ సర్కార్ అరాచక విధానాలను, ప్రజావ్యతిరేక విధానాలను దేశం కళ్లకు కడుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. లోకేష్ ప్రధాని, హోంమంత్రి అప్పాయింట్ మెంట్ కోరలేదు. అసలు వారిని కలుసుకోవాలన్న ఉద్దేశమే లేనట్లుగా హస్తినలో ఆయన వ్యవహరిస్తున్నారు. హస్తిన నుంచే వర్చువల్ గా ఇక్కడి పార్టీ నాయకులతో భేటీ అవుతున్నారు. వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ సంఘీభావం ప్రకటించేందుకు లోకేష్ ను కలవడానికి జాతీయ స్థాయి నేతలకు క్యూకడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాపకింద నీరులా చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రబావం కేంద్రంలోని మోడీ సర్కార్ కూ చుట్టుకుంటోంది.
చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ సర్కార్ కు మోడీ, షాల మద్దతు ఉందన్న అభిప్రాయం జాతీయ స్థాయిలో నెలకొనేందుకు లోకేష్ హస్తిన పర్యటన దోహదపడిందనడంలో సందేహం లేదు. మోడీకి అనుకూలం అని భావించే నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ కూడా బేషరతుగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీకి సంఘీభావం ప్రకటించడాన్ని ఇక్కయ ప్రత్యేకంగా చెప్పు కోవాలి. లోకేష్ హస్తిన పర్యటన, వారం రోజులుగా అక్కడే మకాం వేసిన తీరు ఏపీ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. హస్తినలో లోకేష్ అడుగులు ఒకే సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ నూ, మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ నూ కంగారు పెడుతోంది.
లోకేష్ హస్తిన పర్యటన, వారం రోజులుగా అక్కడే మకాం వేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు చేసిన జగన్ సర్కార్ ఆయనను సాధ్యమైనంత ఎక్కువ కాలం జైలులో ఉంచే విధంగా ప్రణాళికా రచన చేసిందని తెలుగుదేశం భావిస్తున్నది. అందుకే చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా బలంగా న్యాయపోరాటం చేయాలన్న విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన లోకేష్.. రాష్ట్రంలో తెలుగుదేశం లీగల్ టీమ్ చేస్తున్న పోరాటానికి సమాంతరంగా అవసరమైతే సుప్రీం కోర్టులోనూ చంద్రబాబు అక్రమ అరెస్టును చాలెంజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఆయన తన హస్తిన పర్యటనలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులను కూడా కలిసి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. సపోజ్ ఫర్ సపోజ్ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విషయంలో వ్యతిరేక తీర్పు వస్తే వెంటనే సుప్రీంను ఆశ్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్నారని చెబుతున్నారు.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వ్యతిరేక తీర్పు వస్తే.. ఏసీబీ కోర్టు చంద్రబాబును కస్టడీ కి అనుమతించే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. అందుకోసమే వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అవసరంమై చర్యలు తీసుకుంటున్ానరనీ, అందుకోసమే లోకేష్ వారం రోజులుగా హస్తినలో మకాం వేసి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారనీ చెబుతున్నారు. మొత్తం మీద లోకేష్ హస్తిన పర్యటన వైసీపీలో గుబులు రేపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో హస్తినలో దాదాపు బీజేపీ వ్యతిరేక, అనుకూల పార్టీలన్నీ లోకేష్ ను కలిసి సంఘీభావం ప్రకటిస్తుండటంతో బీజేపీలోనూ ఆందోళన వ్యక్తం అవుతోందని చెబుతున్నారు.